ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 3 వరకు శ్రావణమాసం వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శ్రావణ సోమవారాలు, పౌర్ణమి, వరలక్ష్మీవ్రతం, శుద్ధ, బహుళ ఏకాదశి రోజులు, శ్రావణ మాసశివరాత్రి, సెలవు రోజుల్లో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆగస్టు 15 నుంచి 19 వరకు స్పర్శ దర్శనాలను నిలిపివేయనున్నట్లు ఆలయపాలకమండలి పేర్కొంది.శని, ఆది, సోమవారాలు, స్వాతంత్య్ర దినోత్సవం, వరలక్ష్మీవ్రతం, శ్రావణ పౌర్ణమి రోజుల్లో గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, ఆర్జిత కుంకుమార్చనలు పూర్తిగా నిలిపివేయనున్నారు. ఆ రోజుల్లో రోజుకు నాలుగు విడతల్లో స్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నారు.
ఆగస్టు 16న 1,500 మంది ముత్తయిదువులతో సామూహిక వరలక్ష్మీ వ్రతం జరిపించనున్నారు. నాల్గో శుక్రవారం నాడు 500 మంది చెంచు, 1000 మంది ఇతర భక్తులతో వ్రతం చేయించనున్నారు. భక్తులకు ప్రసాదాలతో పాటు చీర, రవిక, గాజులు, పుసుపు కుంకుమ, కైలాస కంకణాలు, శ్రీశైల ప్రభ మాసపత్రిక అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.