ArticlesNews

ధ్యానయోగం.. దైవమార్గం

68views

ఆలోచనా ప్రవాహాన్ని ఒక ప్రత్యేకమైన వస్తువు మీద గానీ, ఒక భావం మీద గానీ,అవిచ్ఛిన్నమైన తైలధారగా స్థిరంగా ఉంచగలిగితే దానిని ‘ధ్యానం’ అంటారు.ధ్యానమంటే మనసు లోతును కొలిచే సాధనంగా నిర్వచిస్తారు తాత్త్వికులు. ఆలోచనల వెనుక అంతర్నిహితంగా దాగిఉన్న శక్తిని పరిశీలించటమే ధ్యాన లక్ష్యం.

మనసును శోధించటం ద్వారా ఆలోచనలను పరిష్కరించటం, సమాధానపరచటం.. ఇదే ధ్యానం. క్రమక్రమంగా ధ్యానంలో పురోగమిస్తూ ఉన్నత స్థాయిని అందుకున్నప్పుడు ఈ మనసు మనం అనుకున్నంత చెడ్డదేమీ కాదని అవగతమవుతుంది. ధ్యానం సిద్ధించినప్పుడు మనసు నుంచి విషయవాసనలన్నీ తొలగిపోతాయి. అప్పుడు మనసు శుద్ధమై ఆధ్యాత్మిక పరిధిలోకి వస్తుంది. ‘ధ్యానం చేసేవారికి దేహాభిమానం తొలగుతుంది. భగవంతుని సాక్షాత్కారం కలుగుతుంది. ఈ జన్మలోనే ముక్తిని పొందుతారు’ అంటోంది వేదాంత పంచదశి.

వదేవుడిపై ధ్యానం…
ఆ పరమాత్మపై మనసును లగ్నం చేయటం అత్యున్నతమైన ధ్యానం. పుణ్యం పురుషార్థాన్ని కలిగిస్తుంది. అందుకే ఆది శంకరాచార్యుల ‘భజగోవిందం’లో…
గేయం గీతానామ సహస్రం,
ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్‌
నేయం సజ్జనసంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తమ్‌

‘భగవద్గీత, విష్ణు సహస్రనామం పఠించాలి. లక్ష్మీనారాయణుని రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనసును ప్రవర్తింపజేయాలి. దీనులైన వారికి దానం చేయాలి’ అని పైశ్లోకానికి అర్థం. ధ్యానసాధనకు ముందుగా శరీరాన్ని సమాయత్తం చేయాలి. అలా చేయకుండా ధ్యానానికి ఉపక్రమిస్తే విపరీత పరిణామాలు ఎదురుకావచ్చు. అహింస, సత్యపాలన, బ్రహ్మచర్యం, అస్తేయం, అపరిగ్రహం అనే విలువలు పాటించకుండా ధ్యానం చేస్తే ఫలితం కనిపించదు. శారీరక, మానసిక పరిశుభ్రతలను పాటిస్తూ, ఆత్మసంతృప్తితో జీవించేవారే ధ్యానానికి అర్హులు.