News

భారత్, అమెరికాల్లో ప్రపంచ శాంతి కేంద్రాలు

43views

భారత్, అమెరికాల్లో ప్రపంచ శాంతి కేంద్రాలను నెలకొల్పనున్నామని ప్రముఖ జైన ఆధ్యాత్మిక నాయకుడు ఆచార్య లోకేశ్‌ ముని తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీలో త్వరలోనే ఈ కేంద్రానికి శంకుస్థాపన చేస్తామని, దిల్లీ కేంద్రం వచ్చే శిశిర రుతువులో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరు వంటి అంతర్జాతీయ సాయుధ సంఘర్షణలు ఆరంభం కావడానికి ముందే సంప్రదింపుల ద్వారా శాంతిని సాధించడానికి తమ శాంతి కేంద్రాలు వేదికలుగా ఉపకరిస్తాయని తెలిపారు. ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగాలు తమ పని తాము చేస్తాయని, తమ వరకు తాము ప్రపంచవ్యాప్తంగా శాంతి దూతలను తయారుచేస్తామని చెప్పారు. వారికి తగిన శిక్షణ ఇస్తామని వెల్లడించారు. భారతీయ సంస్కృతిలో అంతర్భాగాలైన ధ్యానం, యోగ, ఆయుర్వేదాలను ప్రపంచమంతటా వ్యాపింపజేసి ఐక్యత, శాంతిసామరస్యాల సాధనకు అంకితమవుతామని లోకేశ్‌ ముని తెలిపారు. అహింసా విశ్వభారతి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడైన లోకేశ్‌ మునికి ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు గోల్డ్‌ వాలంటీర్‌ సర్వీస్‌ పతకం ప్రదానం చేశారు.