News

జమ్మూకశ్మీర్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈసీఐ

59views

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనడం ఆ ప్రాంతంలో మెరుగవుతున్న పరిస్థితులకు నిదర్శనంగా నిలిచింది. దాంతో ఆ ప్రాంతంలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. రాష్ట్రంలోని రిజిస్టర్డ్, అన్‌రిజిస్టర్డ్ పార్టీలకు గుర్తులు కేటాయించే ప్రక్రియ ప్రారంభించింది. ఆ మేరకు ఈసీఐ శుక్రవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది.

‘‘జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతపు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల కోసం గుర్తుల కేటాయింపు కోసం దరఖాస్తులను ఆమోదించడానికి ఎన్నికల సంఘం నిర్ణయించింది’’ అంటూ ఈసీఐ సెక్రెటేరియట్ తమ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఈ నోటిఫికేషన్‌తో జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలకు సన్నాహాలు మొదలైనట్లే. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి జూన్ 22 నుంచి అమలు చేయాలని ఈసీఐ భావిస్తోంది.

జమ్మూకశ్మీర్‌లో చివరిసారిగా నవంబర్ 2014లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి, దాని తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేసింది.

గత డిసెంబర్‌లో 370 అధికరణం రద్దు నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పునిచ్చిన సందర్భంలో, జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 2024లోగా ఎన్నికలు నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించింది.