ArticlesNews

సాగర స్సాగరోపమః

160views

( జూన్‌ 8 – సాగర దినోత్సవం )

సాగర స్సాగరోపమః’ అన్నాడు వాల్మీకి మహర్షి. సముద్రం ఎంత గొప్పదంటే సముద్రమంత. అంతే! కాదూ కూడదంటే జీవితమంత! అవును.. సముద్రానికి, జీవితానికి కొంత సారూప్యత ఉంది. జీవితం ఎంత గంభీరమైందో, సంక్లిష్టమైందో, ఆహ్లాదమైందో, ఆనందదాయకమైందో.. సాగరం కూడా అంతే.సముద్రం.. అపురూపం, అనంతం, అద్భుతం. కష్టానికీ, పట్టుదలకూ ప్రతిఫలాన్ని ముట్టజెబుతుంది. కష్టపడినవారికి ఆహారాన్ని ఇస్తుంది. ఇంకాస్త లోనికెళ్లి శ్రమిస్తే ముత్యాలు, రత్నాలు మొదలైన వాటిని అందిస్తుంది.

పౌరాణిక గాథల్లో కొన్ని నేరుగా, ఇంకొన్ని ప్రతీకాత్మకంగా, నిగూఢంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సప్తసముద్రాల భావనను అర్థం చేసుకున్నప్పుడు అందులో దాగి ఉన్న జ్ఞానానికి ముక్కున వేలు వేసుకోవాల్సిందే! పురాణేతిహాసాలను అనుసరించి- లవణ (ఉప్పు), ఇక్షు (చెరకురసం), సురా (మద్యం), ఘృత (నెయ్యి), దధి (పెరుగు), క్షీర (పాలు), శుద్దోదక (మంచినీరు) అంటూ ఏడు సముద్రాలున్నాయి. ఈ సప్తసముద్రాలు మన శరీరంలో స్వేద,మూత్రజల, శుక్ర, పైత్యరస, అశ్రుజల, దధి, సప్తద్రవాల రూపంలో కొలువై ఉంటాయి.

గంభీరంగా ఉండే తత్వాన్ని నా పదో గురువైన సముద్రం నుంచే నేర్చుకున్నాను… అన్నాడు దత్తాత్రేయ స్వామి.లంకా నగరానికి దారిమ్మని సముద్రుని ప్రార్థించాడు భగవత్‌ స్వరూపుడైన శ్రీరాముడు. విష్ణుమూర్తి తొలి అవతారమైన మత్స్యానికి ఆశ్రయం కల్పించిందీ, మర్రి ఆకుపై శయనించిన వటపత్ర శాయిని పొత్తిళ్లలో బిడ్డలా అక్కున చేర్చుకున్నదీ సముద్రమే.క్షీరసాగరం అంటే పాలసముద్రం. పాలు స్వచ్ఛతకు ప్రతీక. అది వైకుంఠంలో ఉంటుంది.మనసు అనేది మహాసముద్రం. మంథర పర్వతం ఏకాగ్రత. తాబేలు లక్ష్యసాధనకు ఆధారం. వాసుకి లక్ష్యం దిశగా నడిపించే సాధనం అన్నది క్షీరసాగర మథనం అంతరార్థం.