News

స్టార్‌షిప్‌ ప్రయోగం విజయవంతం

63views

స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన స్టార్‌షిప్‌ మెగా రాకెట్‌ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది. మునుపటిలా విస్ఫోటం చెందకుండా అది క్షేమంగా భూమికి తిరిగొచ్చింది. మానవులను అంగారకుడు, చందమామపైకి తీసుకెళ్లేందుకు స్పేస్‌ఎక్స్‌ సంస్థ దీన్ని రూపొందించింది. ఈ భారీ రాకెట్‌లో రెండు అంచెలు ఉన్నాయి. ఇందులో ‘సూపర్‌ హెవీ’ రాకెట్‌ బూస్టర్, దానికి ఎగువన స్టార్‌షిప్‌ వ్యోమనౌక ఉన్నాయి. గురువారం ఇది దక్షిణ టెక్సాస్‌లోని బోకా చికా గ్రామంలో ఉన్న ప్రయోగ వేదిక నుంచి నింగికెగిసింది. 74 కిలోమీటర్ల ఎత్తులో.. ఎగువ దశ నుంచి సూపర్‌ హెవీ బూస్టర్‌ విడిపోయింది. అనంతరం అది వేగాన్ని నియంత్రించుకుంటూ సాఫీగా గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో సముద్ర జలాల్లో పడింది. మరోవైపు స్టార్‌షిప్‌ తన సొంత ఇంజిన్ల సాయంతో నింగిలోకి దూసుకెళ్లింది. 200 కిలోమీటర్ల ఎత్తు వరకూ వెళ్లి, అనంతరం సురక్షితంగా హిందూ మహాసముద్ర జలాల్లో దిగింది.