News

తిరుమలలో పెరిగిన రద్దీ

1.7kviews

తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. గురువారం సాయంత్రం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్లుమెంట్లు, నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం సర్కిల్‌ వరకు దాదాపు కిలోమీటరు మేర వ్యాపించింది. వీరికి 20 గంటల దర్శన సమయం పడుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. గురువారం రాత్రి ఆలయంలో పూలంగిసేవ కూడా ఉన్న నేపథ్యంలో లైన్‌ దాదాపు రెండు గంటల పాటు ముందుకు కదల్లేదు. దీంతో క్యూలైన్‌లోని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు భక్తులు క్యూలైన్‌లో ఉండలేక తిరిగి వెళ్లారు. మరికొందరు క్యూలైన్లలో కూర్చున్నారు. శుక్రవారం వేకువజాము ఆర్జితసేవలు, ఉదయం అభిషేకం, వీఐపీ బ్రేక్‌ ఉన్న క్రమంలో వీరికి దర్శనం ఆలస్యమయ్యే అవకాశముంది. కొన్ని ప్రదేశాల్లో శ్రీవారిసేవకులు క్యూలైన్‌లో భక్తులకు తాగునీరు అందిస్తూ కనిపించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సేవకులు లేకపోవడంతో భక్తులే భక్తులకు తాగునీరు, ఆహారం అందిస్తూ కనిపించారు. మరోవైపు శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్‌, అన్నప్రసాదకేంద్రం, బస్టాండ్‌, లేపాక్షి సర్కెల్‌ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.