ArticlesNews

దేవుడా.. సౌకర్యాలేవీ?

85views

చారిత్రక ప్రాభవాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖ పుణ్యక్షేత్రాల చెంత సమస్యలు రాజ్యమేలుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల పాలనలోకి విలీనమైన దివ్యాలయాల్లో వసతుల కొరత వెంటాడుతోంది. యాత్రికులను అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. చరిత్ర పుటల్లో చెరగని స్థానం పొంది విరాజిల్లుతున్న భవ్య ఆలయాల్లో పర్యాటకులకు కావాల్సిన సదుపాయలు కల్పించడం లేదు. ఏటా వార్షిక బ్రహ్మోత్సవాల వేళ హడావిడిగా ఏర్పాట్లు చేయడానికి రూ.లక్షలు గుమ్మరిస్తున్నారు. సాధారణ రోజుల్లో భక్తుల ఇబ్బందులను గాలికొదిలేస్తున్నారు. తాగేందుకు గుక్కెడు నీరందక గొంతెండిపోతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రివేళ బస చేయడానికి అనువైన గదుల్లేక నానా అవస్థలు పడుతున్నారు. దేవుడా సౌకర్యాలేవీ అనే మాట సందర్శకుల నోట వినిపిస్తోంది.

ఒంటిమిట్టలో కొలువైన కోదండ రామాలయంలో యాత్రికులు వేచి ఉన్న భవనంలో కొన్ని రోజులుగా తాగునీటి శుద్ధి కేంద్రం పనిచేయడం లేదు. ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్న దాహం కేకలతో తల్లడిల్లిపోతున్నారు. రూ.కోటి వెచ్చించి పుష్కరిణి నిర్మించారు. స్వామి వారి చక్రస్నానం ఘట్టం కోసం నీటిని నింపుతున్నారు. ఆనక జలాలను తీసేస్తున్నారు.

తిరుమలేశుని తొలి గడపగా ఖ్యాతి పొందిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు అవస్థలు తప్పడం లేదు.ఇప్పటికీ ఇక్కడ అన్నదానం చేయడం లేదు. భక్తుల సహకారంతో ప్రతిరోజూ 50-100 మంది, శనివారం 250-300 మందికి ఆకలి తీర్చుతున్నారు.

పదకవితా పితామహుడు అన్నమాచార్యుల జన్మస్థలి రాజంపేట మండలం తాళ్లపాకను టీటీడీ రెండు దశాబ్దాల కిందట దత్తత తీసుకొంది. ఆ తర్వాత కొన్ని మౌలిక వసతులు కల్పించినప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు.తాళ్లపాకలో వేద పాఠశాల, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వెళ్లినా ఆచరణకు నోచుకోలేదు.

Source : ఈనాడు