ArticlesNews

గీత మార్గగామి

603views

కష్టనష్టాలు, దుఃఖం మానవసహజం. అలాంటి సందర్భాల్లో హితులైనవాళ్లు ఆత్మీయవచనాలు పలికితే స్థైర్యంగా ఉంటుంది. మానసిక శాంతి లభిస్తుంది. కానీ ఎవరి సమస్యలు వారికుంటాయి కనుక వేరొకరికి ఆలంబన అందించే అవకాశం అన్నిసార్లూ ఉండదు. అందుకే తోటి మనుషుల కంటే లోకరక్షకుడైన భగవంతుడి మీద భారం వేయడం ఉత్తమం.

‘కర్తవ్యాన్ని నిర్వహించు, ప్రతిఫలాపేక్ష వద్దు’, ‘చేసేది నువ్వయినా చేయించేది నేనే’ అంటూ ఆయా సందర్భాల్లో హితోపదేశం చేశాడు గీతాకారుడు. అంటే మన బాధ్యత స్వీకరించేది, మనల్ని నడిపించేదీ జగన్నాథుడే. మనం తోటి వ్యక్తులను విశ్వసించక పోవచ్చు. వారి మీద సందేహం కలగొచ్చు. కానీ సర్వసమర్థుడు, మహాశక్తి మంతుడు, యోగీశ్వరుడు, సకలసిద్ధులకూ అధిపతి అయిన దేవాధిదేవుడి మీద అపనమ్మకం ఉండదు కదా! అందుకే భగవద్గీత శ్లోకాలు వింటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. గీతలో సర్వ సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. మన పాపకర్మల నుంచి విముక్తికి ఆ కర్మయోగిని నమ్ముకోవడం శ్రేయస్కరం. భయాలూ, సందేహాలను వదిలి, స్థితప్రజ్ఞత అలవరచుకుంటే బాధల నుంచి విముక్తి కలుగుతుంది. జగన్నాథుని త్రికరణశుద్ధిగా నమ్మి మన సమస్యలను విన్నవించుకుంటే.. పరిష్కారమార్గం తప్పకుండా దొరుకుతుంది. అందుకే గీతను మార్గగామి అంటారు.