ArticlesNews

అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి, వివేకాన్ని, జ్ఞానాన్ని కలిగించిన వారు శ్రీ విద్యారణ్యులు

144views

( మే 14 – విద్యారణ్యుల జయంతి )

ఏకశిలానగరం (నేటి వరంగల్‌) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ముగ్గురు మగ పిల్లలలో పెద్దవాడు మాధవుడు (విద్యారణ్యులు). వారి తల్లిదండ్రులు మాయణాచార్యుడు, శ్రీమతిదేవి. వారిది పేద,పండిత కుటుంబం.శృంగేరి పీఠాధిపతి వీరికి సన్యాసదీక్ష ఇచ్చారు. మాధవులకు విద్యారణ్యులని ఆశ్రమనామం ఇచ్చారు.

ఒకసారి శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థ శిష్యులను వారి వారి జీవిత లక్ష్యాలను చెప్పమన్నారు. అందరూ రకరకాలుగా చెప్పారు. విద్యారణ్యులు దేశ, ధర్మాలను రక్షించడమే తన లక్ష్యమని, దానికోసమే తన జీవితాన్ని సమర్పిస్తానని చెప్పారు.విద్యారణ్యులు కాశీయాత్ర ముగించుకుని, హంపి చేరి తీవ్ర తపస్సు చేసారు.

మొగలాయి దండయాత్రలు, ఆగడాలతో దక్షిణ భారతదేశం అతలాకుతలమయింది. శ్రీరంగం, మధుర మొదలయిన ప్రధాన దేవాలయాలతో సహా అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. అనేకమంది హిందువులు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు.ఈ పరిస్థితులు చూసి విద్యారణ్యులు చాలా బాధపడ్డారు.

హరిహరబుక్కలు పంపారణ్య ప్రాంతంలో తిరుగుతూ విద్యారణ్యుల దగ్గరకు చేరారు.వారి సహాయంతో విజయనగర సామ్రాజ్యానికి పునాదులు వేసారు. ఇలా హిందూసామ్రాజ్యం స్థిరపడిన తరువాత రాజకీయంగా హిందువులను స్థిరపరచడంతోపాటు ధార్మికరంగంలో హిందువులకు మార్గదర్శనం చేశారు.

ఇలా 14వ శతాబ్దంలో ముస్లిందాడులు, ఇతర చారిత్రకకారణాలవల్ల బలహీనపడిన హిందూసమాజ, సంస్కృతులను సంస్కరించి, పునరుజ్జీవింపచేయడంలో మాధవవిద్యారణ్యులు ప్రముఖపాత్ర నిర్వహించారు.ఆ విధంగా హిందూధర్మ పరిరక్షణకు పాటుపడిన విద్యారణ్యులవారిని ‘అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి, వివేకాన్ని, జ్ఞానాన్ని కలిగించిన విద్యారణ్యు లకు నమస్కారం’ అని ప్రతి రోజు ప్రతి హిందువు గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.