ArticlesNews

బలగాల విభాగంలోనూ భగవానుడి ధర్మనిరతి

147views

కురుక్షేత్రం సంగ్రామంలో తన సాయం కోరిన దుర్యోధన అర్జునులకు బలగాన్ని పంచడంలో శ్రీకృష్ణుడు అనుసరించిన విధానాన్ని ఎవరెంత వ్యాఖ్యానించినా ఆ చర్య వెనుక ధర్మకాంక్షే దాగుంది. ‘మహాసంధి’ సూత్రాలననుసరించి పూర్ణసైన్యాన్ని దుర్యోధనుడికి ఇచ్చాడు. తాను పాండవులవైపునకు. ఈ సైన్యం కౌరవ పక్షంలో ఉండి చేసిన సహాయం ఎలాంటిదో మనం విచారించనక్కరలేదు.

భగవాన్ కృష్ణుడు ధర్మమని దేనిని ప్రవచించాడో అది ఆయన యుద్ధంలో స్పష్టంగా తేలింది. కౌరవపక్షంలో ఉన్న సమస్త మహారధుల సంహారాన్ని గురించిన కథ యావత్తు అందరికీ తెలిసిందే. బాణసంధానం కూడా చేయనట్టి సందర్భంలో, శిఖండి అండతో భీష్మవధ జరిగింది. ఏదో ఒక ఏనుగును చంపి ‘అశ్వత్థామ హత్య’ అనే అసత్యవార్తను కల్పించి, ధర్మ రాజంతటి సత్యవాది నోటకూడా “అశ్వత్థామ హతోవరోహ కుంజరోవా” అని అనిపించి, దుఃఖాతిశయం వల్ల ద్రోణుడు శస్త్రసన్యాసం చేసి హతుడయ్యాడు.పై సమీక్షలవల్ల ఇవి అన్యాయాలుగా, అధర్మాలుగా కనిపించడం సహజం, కాని ఇవి సంపూర్ణ న్యాయ సమ్మతాలూ, ధర్మబద్ధాలున్నూ. ఈలాంటి ఆచరణ ద్వారానే సంవత్సరాల తరబడి అనేక మంది మునులూ పరిరక్షించుతూన్న ధర్మ రాజ్య స్థాపితం పొందింది. మహార్షి వ్యాసుడు దేని కొరకు దుఃఖిస్తూ.

ఊర్ధ్వ బాహుర్విరౌ భ్యేష నచ కశ్చిచ్ఛృణోతుమే
ధర్మాధర్మశ్చ కామశ్చ సధర్మః కింన సేన్యతే
అని అంటూండేవాడో అట్టి ధర్మ రాజ్యాన్ని తన ఈ నీతి ద్వారా భగవాన్ శ్రీకృష్ణుడు స్థాపించాడు. అలాంటి మహాపురుషుణ్ణి అధర్మ ప్రవృత్తిగలవాడని కానీ, అసత్యవాది అనికాని ఎలా అనగలం? ఆయన సత్యవచనం ఉచ్ఛరించినంత మాత్రాన ఉత్తరాగర్భస్థ మృత పరీక్షిత్తు జీవితుడైనాడే! ఇంతవరకు తామన్న ఒక్క మాటకూడా యదార్థంగా తేలని ఈనాటి మహాసత్యవాదులంతా దీన్ని పొల్చిచూచుకుంటే ఎంతో మేలు. అప్పుడు వారు ‘సత్యం’ అంటే వాస్తవికంగా ఏమిటో తెలుసుకోగలుగుతారు.