ArticlesNews

హిందూ వ్యతిరేకతే ధ్యేయంగా…

125views

చరిత్రలో హిందువులు ఎన్ని దారుణమైన పరిణామాలు చూశారో, ఎన్ని చేదు జ్ఞాపకాలు మింగారో మన చరిత్రకారులు కాకపోయినా, విల్‌ డ్యూరాంట్‌ వంటి పాశ్చాత్య చరిత్రకారులు చక్కగా చెప్పారు. ఆ ఘర్షణలలో హిందూ సమాజం కునారిల్లి పోయింది. కానీ ఇక్కడి చరిత్రకారులు మాత్రం ఆ ఘర్షణను, హిందూ సమాజం పడిన అవమానాలను చరిత్రపుటలలో చేర్చడానికి నిరాకరించారు. అందుకు వారు చెబుతున్న కారణం, ఆ ఘర్షణలను, రక్త పాతాన్ని విద్యార్థులకు వెల్లడిస్తే మత సామరస్యం దెబ్బతింటుందట. అంటే హిందు వుల అవమానాలు, దురాక్రమణదారులను ఎదిరించిన భారతీయుల సాహసాలు అన్నీ మరుగున ఉండిపోవాలి. చరిత్ర అంతా హిందువులు, ముస్లింలు సయోధ్యతోనే ఉన్నారని బొంకాలి. వాస్తవ చరిత్ర అదే అయితే అదే రాయవచ్చు. కానీ కాదు. అయోధ్య, కాశీ, మధురలలో బయటపడిన శిథిలాలు అందుకు సాక్ష్యం చెబుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ప్రథమ ప్రధాని, విద్యామంత్రి వంటి వారు హిందువులు అణగిమణిగి ఉండవలసిన వర్గంగానే పరిగణించారు. హిందూ జీవన విధానం పలచబడి పోవాలన్న ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తుంది.

భారతదేశంలో తమిళ ప్రాంతానికి లేదా మద్రాసు ప్రెసిడెన్సీకి ఎంతో ప్రత్యేకత ఉంది. కానీ అక్కడ స్వాతంత్య్రానికి ముందు జస్టిస్‌ పార్టీ పేరుతో సాగిన వేర్పాటుధోరణులు స్వతంత్ర భారతదేశంలో కూడా కొనసాగాయి. అవే ద్రవిడ రాజకీయాలు. రాముడి విగ్రహంతో సాగుతున్న ఊరేగింపుల మీద చెప్పులు విసిరిన ఘనత అక్కడి ద్రవిడ ఉద్యమానిది. దాని అధినాయకుడు రామస్వామి నాయకర్‌ వ్యాఖ్యలు, విధానాలు వికారం కలిగిస్తాయి. రాముడు దక్షిణ భారతానికి చెందినవాడు కాదు అనడం, హిందీ వ్యతిరేకత, అంశాలు అన్నీ కూడా దేశ వ్యతిరేకతను ప్రబోధించేవే. అసలు సనాతన ధర్మాన్ని దేశం నుంచి నిర్మూలించడమే తక్షణ కర్తవ్యమని ఓ ద్రవిడ ఆ పార్టీ ఇటీవల పిలుపునిచ్చింది.

ఆర్యులు, ద్రావిడులు అన్న శుష్క సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని మరొక విభజనకు గురి చేయాలని (ఉత్తర భారతం, దక్షిణ భారతం) కూడా కుట్రలు సాగాయి. తెల్లగా ఉండేవారంతా ఆర్యులట. నల్లగా ఉన్నవారంతా ద్రావిడులట. ఆర్యులు ఇక్కడికి వచ్చి మూలవాసులను తరిమివేశారట.

సోమనాథ్‌ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ ఆలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ హాజరు కాదలిచారు. ఆయన వెళ్లకుండా అడ్డుకోవడానికి నెహ్రూ చేయని ప్రయత్నం లేదు. అయినా రాజేంద్రప్రసాద్‌ హాజరయ్యారు. ఈ విభేదాలు ఆ పెద్దలిద్దరి మధ్య చిరకాలం కొనసాగాయి.

‘హిందుత్వ’ పేరుతో ఒక పుస్తకం రాసినందుకు, హిందూ మహాసభకు నాయకత్వం వహించినందుకు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను ఈనాటికీ కొందరు ఉదారవాదులు పరమ నీచంగా చిత్రిస్తూ ఉంటారు. ఆ పేరుతో సావర్కర్‌ దేశ స్వాతంత్య్రం కోసం చేసిన నిరుపమాన త్యాగాలను మరుగుపరిచే యత్నం చేస్తున్నారు. కానీ గతంలో ఇందిరాగాంధీ సావర్కర్‌ త్యాగాన్ని శ్లాఘించి, నాణెం విడుదల చేశారు. అయినా ఇప్పుడు ఆయనను దూషిస్తే సెక్యులర్‌ వీరతాళ్లు దండిగా పడతాయి కాబట్టి పరమ నీచంగా కొన్ని పార్టీల నాయకులు నిందలు వేస్తుంటారు.

గాంధీజీ హత్యలో సావర్కర్‌ను ఇరికించడం, ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించడం రెండూ కూడా హిందూత్వ కోణం నుంచి చూడవలసినవే. తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ను రెండుసార్లు నిషేధించారు.

అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను అనుమ తించాలంటూ కొందరు మహిళలు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

ఇది పూర్తిగా హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశమే అయినా న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పును ఇచ్చింది. దీనిని అడ్డుకోవాలని మహిళలు తీవ్ర ప్రయత్నం చేశారు. కేరళ ప్రభుత్వ పోలీసుల చేతిలో దారుణ హింసకు గురయ్యారు. ఇంతకీ అయ్యప్ప ఆలయం లోకి వెళ్లడానికి స్త్రీలను అనుమతించాలని కోరుతూ కోర్టుకు వెళ్లిన మహిళలెవ్వరూ ఆ దేవాలయం ప్రత్యేకత గురించి, అక్కడి సంప్రదాయాల గురించి తెలిసినవారే కాదు. హిందూ ధర్మం మీద కక్ష కట్టిన ఎన్‌జీవోల తరఫున పనిచేసే వారు మాత్రమే. వీరినే ఆనాడు చాలామంది ఒక ప్రశ్న అడిగారు. హిందూ ధర్మంలో మహిళలకు ప్రవేశంలేని ఆలయాలు ఒకటి రెండు మాత్రమే. కానీ అసలు ఈ భూమి మీద ఉన్న ఏ మసీదులోను స్త్రీలకు ప్రార్థన అవకాశం లేదు. వేరే స్త్రీలు కాదు, ఆ మతంలోని స్త్రీలకే ప్రవేశం లేదు. ఆ విషయం గురించి మీకెందుకు పట్టదు? దీనికి ఇప్పటికీ సమాధానం లేదు. అయ్యప్ప ఆలయం లోకి మహిళలను అనుమతించాలని పట్టుపట్టిన మహిళామణులు జ్ఞానవాపి కట్టడంలో శృంగార గౌరి పూజల కోసం కొందరు మహిళలే కోర్టుకు వెళితే మాత్రం వారికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

కర్ణాటక ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం మైసూరు నవాబు టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలు ఆరంభిం చింది. టిప్పు చరిత్ర మతవివక్షతో మలిన మైనది. అతడు మేల్కోటే అనే గ్రామంలో ప్రవేశించే ఒకే రోజున వేలాది మంది శ్రీవైష్ణవులను హత్య చేశాడు. కానీ ఒక మొండి పట్టుదలతో కర్నాటక ప్రభుత్వం అతడి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నది.

హిందూ దేవీదేవతల మీద అవాకులు చెవాకులు పేలేవాళ్ల సంఖ్య తక్కువే మీ కాదు. ఇందుకు తాజా ఉదాహరణ ఒక ప్రొఫెసర్‌ సీతమ్మను రాముడు విఫణిలో పెట్టి అమ్మేశాడని సోషల్‌ మీడియా పోస్టులో పెట్టాడు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తరువాత, దేశమంతటా ఒక చైతన్యం వెల్లివిరిసిన తరువాత పుణేలో ప్రదర్శించిన ఒక నాటికలో సీతమ్మ చేత పొగతాగించారు.ఎంఎఫ్‌ హుసేన్‌ చిత్రకారుడు తన కారు మీద సరస్వతి అమ్మ వారి బొమ్మను నగ్నంగా చిత్రిం చాడు. స్వామిప్రసాద్‌ మౌర్య అనే ఉత్తరప్రదేశ్‌ రాజకీయ నాయకుడు రామచరిత్‌ మానస్‌ను దగ్ధం చేయించాడు. అందులో వివక్షను ప్రేరేపించే అంశాలు ఉన్నాయని ఆ మూర్ఖుడి వాదన. ఇక భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో హిందూ దేవుళ్ల మీద, పండుగల మీద, జీవన విధానం మీద ఎన్ని వేల కథలు, కార్టూన్లు, రచనలు, సినిమాలు వచ్చి ఉంటాయో చెప్పడం కూడా కష్టం. కానీ వాస్తవంగా హిందువులు బాధితులుగా ఉన్న కశ్మీర్‌ లోయ ఘోరాలు, కేరళ హిందూ యువతుల అపహరణాలు, నిజాం రాజ్యంలో రజాకార్‌ అరాచకాలు ఇతివృత్తాలుగా చలనచిత్రాలుగా వస్తే ఉదారవాదులు విపరీతంగా బురద చిమ్ముతారు. అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూలిన తరువాత బంగ్లాదేశ్‌లో అనేకమంది హిందువులను ఊచకోత కోశారు. ఆ అంశాలే ఇతివృత్తంగా తస్లిమా నస్రీన్‌ ‘లజ్జ’ పేరుతో నవల రాశారు. దీనితో ఆమె భారతదేశానికి వచ్చి తలదాచుకోవలసి వచ్చింది. తస్లిమాకు మద్దతుగా ఒక్క మహిళా సంఘం, హక్కుల సంఘం కూడా ప్రకటన చేయలేదు. వీటిని సాధారణంగా కమ్యూనిస్టులే దొంగపేర్లతో నడుపుతూ ఉంటారు.

కొందరు క్రైస్తవ మిషనరీలు, ముస్లిం మతోన్మా దులు కూడా ప్రత్యేక దేశం నినాదాలు చేస్తున్నారు. మరొక పాకిస్తాన్‌ కావాలని వాళ్లు, పాకిస్తాన్‌ ఇచ్చినట్టే మాకూ ఒక స్వతంత్ర రాజ్యం కావాలని వీళ్లు నినాదాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ హిందూ వ్యతిరేకతే ధ్యేయంగా సాగుతున్నవే కావడం గమనార్హం