
శ్రీశైల మహాక్షేత్రంలో త్వరలో జరుగనున్న ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు మంచినీటి కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాగునీటికి ఇబ్బందులు తల్తెత్తకుండా పకడ్బంది చర్యలు చేపడుతున్నారు.
ఉత్సవాలలో రోజుకు 1.35 కోట్ల లీటర్ల నీటి సరఫరా చేయనున్నారు. క్షేత్ర పరిధిలో మహాశివరాత్రికి ఏర్పాటు చేయబడిన మంచినీటి కుళాయిలన్నింటిని ఉగాది ఉత్సవాలలో వినియోగించుకునేలా వీలు కల్పించారు. క్షేత్ర పరిధిలో పలుచోట్ల 450పైగా మంచినీటి కుళాయిలను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. రింగ్‌రోడ్డు, ఉద్యానవనాలు, ఆరుబయలు ప్రదేశాలు మొదలైన చోట్ల 40కి పైగా సింటెక్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. అలాగే 15 అదనపు సింటెక్ ట్యాంకులను ఏర్పాటు చేయడంతో పాటు క్షేత్రపరిధిలో శాశ్వతంగా 11 ఆర్‌సిసి ట్యాంకులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా క్షేత్ర పరిధిలో 34 ఆర్‌ఓ ప్లాంట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం, కై లాసద్వారం, పెద్దచెరువు తదితర ప్రదేశాలకు కూడా మంచినీటి సరఫరా చేయనున్నారు. భీమునికొలను వద్ద తాత్కాలికంగా 1,600 మీటర్ల పొడవున హెచ్‌డీపీ పైప్‌లైన్ ఏర్పాటు చేసి నీటిసరఫరా చేస్తున్నారు. కై లాసద్వారం – భీమునికొలను మార్గమధ్యంలో 1,000 లీటర్ల సామర్థ్యం ఉన్న 8 సింటెక్స్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఉగాది ఉత్సవాల్లో భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు.