News

హిందూ ఆలయాలపై దాడులు.. నివేదిక కోరిన అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు!

258views

అమెరికాలోని హిందూ దేవాలయాలపై ఇటీవలి కాలంలో తరచూ దాడులు చోటుచేసుకుంటున్నాయి. వీటిపై జరుగుతున్న విచారణ ఎంతవరకూ వచ్చిందో తెలియజేయాలని కోరుతూ ఐదుగురు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు అమెరికా న్యాయ శాఖకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ప్రార్ధనా స్థలాల వద్ద విధ్వంసక చర్యల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులు ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, శ్రీతానేదార్, అమీ బేరా తదితరులు రాశారు.

యూఎస్‌ కాంగ్రెస్ సభ్యులు ఈ ఉదంతాలకు సంబంధించి జరుగుతున్న విచారణ స్థితిగతులను తెలియజేయాలని డిమాండ్ చేశారు. న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వరకు పలు మందిరాలపై జరుగుతున్న దాడులు హిందూ అమెరికన్లలో ఆవేదనకు దారితీస్తున్నాయని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న అనుమానితులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడం విచారకరమన్నారు. దీంతో ఇక్కడి హిందువులలో చాలామంది భయం, బెదిరింపుల మధ్య జీవించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని వారు ఆ లేఖలో వివరించారు. చట్ట ప్రకారం అందరికీ సమాన రక్షణను కల్పించడానికి తగిన ఫెడరల్ పర్యవేక్షణ ఉందా? అని వారు ఆ లేఖలో ప్రశ్నించారు.

జనవరిలో కాలిఫోర్నియాలోని హేవార్డ్‌లోని ఒక ఆలయంపై దాడులకు పాల్పడిన దుండగులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాశారన్నారు. ఇలాంటి ఉదంతమే నెవార్క్‌లోని మరొక దేవాలయంలో కూడా జరిగిందన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ ద్వేషపూరిత దాడుల నివారణకు ప్రభుత్వం ఏమిచేస్తున్నదని వారు ప్రశ్నించారు. దీనిపై సంబంధిత విభాగం తమకు గురువారంలోగా నివేదిక అందించాలని యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులు ఆ లేఖలో కోరారు.