![](https://vskandhra.org/wp-content/uploads/2024/04/vennelakanti.jpg)
ప్రజలందరూ ‘నెల్లూరు గాంధీ’ అని ప్రేమగా పిలుచుకునే స్వర్గీయ వెన్నెలకంటి రాఘవయ్య 1897 జూన్4 తారీఖున నెల్లూరుజిల్లా కోవూరు తాలూకా శింగపేటలో శ్రీ వెన్నెలకంటి పాపయ్య, నుబ్బమ్మ, దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తల్లి చనిపోవటంతో రాఘవయ్య తన సోదరి దగ్గర పెరిగాడు ఏడేళ్ళ చిరుప్రాయంలోనే తన స్నేహితుడు వేమూరి లక్ష్మయ్యతో కలిసి అల్లూరు గోడలపై ‘వందేమాతరం మనదే రాజ్యం’ వంటి నినాదాలు వ్రాసేవాడు. నెల్లూరు వి.ఆర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేసేటప్పుడు మిల్లు వస్త్రాలు బహిష్కరించాలంటూ పికెటింగ్ నిర్వహించాడు. నెల్లూరులో హైస్కూలు విద్య పూర్తయ్యాక మద్రాస్ పచ్చయప్ప కళాశాలలో బి.ఏ లో చేరాడు. అనంతరం న్యాయవాద విద్య అభ్యసించే సమయంలో అరవింద ఘోష్, తిలక్‌ల ప్రభావంతో విప్లవోద్యమం వైపు మరలాడు. సాక్షాత్తూ గాంధీజీనే కలిసి అహింసా పోరాటం వల్ల దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించదని, స్వాతంత్య్ర సాధనకు హింసామార్గమే శరణ్యమని వాదించాడట. రాఘవయ్య వాదనాపటిమకు ముగ్ధుడైన గాంధీజీ ‘మీ మార్గం మీది నా మార్గం నాది’ అని చెప్పి అంతటితో ఆ వాదనను ముగించారట.
స్వాతంత్ర్యోద్యమానికి జమీన్ రైతు ఉద్యమానికి జిల్లాలో కేంద్రంగా ఉన్న ‘పోట్లపూడి’లో 1913లో ‘సుజనరంజనీ సమాజ స్థాపన జరిగింది, పొణకా కనకమ్మ, పట్టాభిరామరెడ్డి, మోపూరు పిచ్చిరెడ్డి, గండవరపు హనుమారెడ్డి, నెల్లూరు వెంకట్రామానాయుడు తదితరులు ఈ సమాజానికి వెన్నుదన్నుగా ఉండేవారు. అప్పట్లో ఈ సమాజం రాజకీయాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా, వెన్నెలకంటి రాఘవయ్య, చతుర్వేదుల కృష్ణయ్యల ప్రవేశంతో ఏకంగా విప్లవబీజాలే నాటుకున్నాయి. మద్రాసులో రహస్య జీవితం గడుపుతుండిన వి.ఓ. చిదంబరం పిళ్లైతోనూ, ఉన్నవ లక్ష్మీనారాయణతోనూ, రాఘవయ్య స్నేహం కలుపుకున్నాడు. పిళ్లై ద్వారా పాండిచ్చేరి నుంచి రహస్యంగా రివాల్వర్లు తెప్పించేవాడు. అప్పట్లో రివాల్వరు ధర 1964 రూపాయలు. ఉడుకురక్తం ఉరకలువేసే ఆ తరుణంలో తిలక్‌గారితో రహస్య సమాలోచనలు చేసేందుకు రాఘవయ్య రెండుసార్లు పూనాకు వెళ్లి వచ్చాడు కూడా. ‘పల్లెపాడు’లో పినాకినీ నదీతీరాన మామిడితోపులో అక్కడ రివాల్వర్లు పేల్చడం నేర్చుకున్నారు. (ఆ తర్వాత ఈ మామిడితోపులోనే గాంధీజీ ‘పినాకినీ ఆశ్రమాని’కి ప్రారంభోత్సవం చేశారు) ఈ సమాజ సేవాకార్యక్రమాల్లో ఎదుగుతూ, మద్రాసు చదువుకు ఎగనామం పెట్టి నెల్లూరు వచ్చేశాడు. ఉద్యమ కార్యక్రమాల్లో ఊపిరి తిరగకుండా పనిచేస్తూనే, మరోవైపు గిరిజనుల శ్రేయస్సు కోసం రాఘవయ్య కృషి చేశారు. 1927 పెద్ద గాలివానలో సర్వస్వం కోల్పోయి విలవిల్లాడుతున్న వందలాది గిరిజనులు సంక్షేమానికి, తక్షణ సాయం అందించడంలో ఎదురైన చేదు అనుభవాలు రాఘవయ్య మనసును కలచివేశాయి. గిరిజనుల బాగుకోసం ఉద్యమాన్ని రగల్భాలని యానాదులు కాలనీ నిర్మాణానికి పూనుకున్నాడు, అక్కడా భూస్వాముల వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది.
రైతుకూలీల వేతనాల పెంపుకోసం 1935లో రైతుకూలీల ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 1938లో రైతుకూలీ మహసభను, ఎమ్.ఎన్ రాయ్ అధ్యక్షతన నిర్వహించాడు. రైతుకూలీలలో 95% మంది దళితులు, గిరిజనులేకదా!
1935 ఫిబ్రవరి 10వ తేదీన నెల్లూరులో టంగుటూరు ప్రకాశం పంతులు ఆధ్యక్షతన మొట్టమొదటిసారిగా ‘యానాదుల సభ జరిగింది. జిల్లాలోని దాదాపు రెండువేలమంది యానాదులు ఈ సభకు వచ్చారు. అప్పట్లో బ్రిటిష్‌వారు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ (సి.టి.యాక్ట్) పేరిట యానాదులను దొంగలుగా ముద్రవేసి తీవ్ర వేధింపులకు గురిచేస్తుండేవారు. రాఘవయ్య లాయరుగా ఆ కేసులను వాదించాడు. సంఘాలు పెట్టి, ఉద్యమించి, సి.టి.యాక్ట్ రద్దుకు అహరహం శ్రమించి విజయం సాధించాడు. 1930 ప్రాంతాల్లో కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొని, 1931 నుంచి 1945 దాకా నెల్లూరుజిల్లా కాంగ్రెసుకు తొలి కార్యదర్శిగా ఉండి, నాలుగేళ్ళపాటు జైలుశిక్ష అనుభవించారు రాఘవయ్య. 1929 అక్టోబరు 19 తేదీన జిల్లా జమీన్ రైతు సంఘం ఏర్పడితే, దాంట్లో కూడా కార్యనిర్వాహకత్వం నెరిపారు. 1946లో మద్రాసు శాసనసభ్యునిగా ఎన్నికై, అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుకు పార్లమెంటరీ సెక్రటరీగా ప్రధానపాత్ర వహించారు.
ఆదిమజాతుల భవితవ్యంకోసం వారి జీవితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలనుకున్నారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘స్టేట్ ట్రైబల్ ఎంక్వయిరీ కమిటీ’కి రాఘవయ్య అధ్యక్షుడయ్యే అమూల్యమైన అవకాశం కల్గింది. రాఘవయ్య రాష్ట్రమంతా పర్యటించి, ఆదివాసీల జీవనసరళిని పరిశీలించి, పరిశోధించి, ఆంగ్లాంధ్ర భాషల్లో తనకున్న ప్రావీణ్యంతో అపురూపమైన గ్రంథాలు రచించాడు. ఆంగ్లంలో ‘ట్రైబ్స్ ఆఫ్ ఇండియా’ ‘నోమాడ్స్ ఆఫ్ ది వరల్డ్, ‘యానాది’ (తెలుగు, ఇంగ్లీషు), ‘ట్రైబల్ రివోల్టు’, ‘ట్రైబల్ జస్టిస్’ వంటి గ్రంథాలు ఆయన రచనాపటిమకు నిదర్శనాలు. ఇవికాక, చెంచుల జీవితాల గురించి ‘అడవిపూలు’ ‘మరియులు’ అనే తెలుగుగ్రంథాల్లో నిక్షిప్తం చేశారాయన.
బ్రతికినన్నాళ్ళూ దళిత, గిరిజనుల అభ్యున్నతి కోసం పరితపించిన ఆ మహనీయుడు శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య సేవలకు గాను వారికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.