కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్ సూచించారు. సోమవారం ఆయన గోకులపాడులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించి భక్తులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దీక్షతో 600 నుంచి 800 కి.మీ దూరం పాదయాత్ర చేస్తూ భక్తులు శ్రీశైలం చేరుకుంటారన్నారు. వీరందరినీ అతిథులుగా భావించి అన్నదానం కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఎండాకాలం అయినందున భక్తులకు పరిశుభ్రమైన నీటిని అందించాలన్నారు. కలుషితం కాకుండా చెంబులు, గ్లాసులు, మగ్గులు తాగునీటిలో ముంచరాదన్నారు. శుభ్రమైన పాత్రలలో తాగునీటిని ఏర్పాటు చేసి వాటికి కుళాయి బిగించి వాడాలని సూచించారు. అవకాశం ఉంటే దాతల సహకారంతో మినరల్ వాటర్ ప్యాకెట్లు అందించాలన్నారు. వేడి వేడి ఆహార పదార్థాలు మాత్రమే భక్తులకు వడ్డించాలని దాతలకు సూచించారు. భక్తులు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిమ్మరసం, చక్కెర నీళ్ల ద్రావణం, మజ్జిగలో కొద్దిగా ఉప్పు కలిపి ఇవ్వాలన్నారు. ఎండలో నడిచే భక్తులు తలపై టోపీ గాని, టవల్ గానీ ధరించాలన్నారు. వడదెబ్బ తగిలితే సత్వర చికిత్స కోసం 108 అత్యవసర సేవలను సంప్రదించాలన్నారు.