ArticlesNews

వైవిధ్య భరితం.. అరుదైన చరితం

136views

కాకినాడ జిల్లా పిఠాపురంలో అది ఉప్పాడ సాగర తీరం. సముద్ర కెరటాల హోరు నిత్యం ధ్వనిస్తుంటుంది. కాని ఏటా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అమావాస్య, పౌర్ణమిలకు సముద్ర ఘోషను సైతం తోసిరాజని అమ్మవార్ల నామస్మరణ మారు మోగుతుంది. గ్రామే దేవతల జాతరలతో అన్ని గ్రామాలు పులకించిపోతాయి. తీర ప్రాంతంలో అమ్మవార్ల జాతరలు విభిన్న ఆచారాలతో ఆకట్టుకుంటాయి. కళకళలాడుతున్న విద్యుద్దీపాల మధ్య జనం చుట్టూ ఉండి కర్రలతో కొడుతున్న దృశ్యం చూస్తే అక్కడ ఏదో పెద్ద గొడవ జరుగుతోందని, ఎవరినో మధ్యలో పెట్టి కొడుతున్నారనే అనుమానం వస్తుంది. కాని అది ఒక ఆచారం అని తెలిసాక ఆశ్చర్యపోక తప్పదు. జనం అందరూ నేలపై పడుకుని ఉండగా ఒక దున్న పోతు వారిపై నుంచి పరుగులు తీస్తుంటే పక్కనే ఊరంతా గుమిగూడి చూస్తూ దణ్ణం పెడుతుంటే ఇదేంటి ఇంత దారుణం జరుగుతున్నా అలా చూస్తున్నారేమిటి అని పిస్తుంది కాని అదీ ఒక ఆచారమే అని తెలిసాకా ఔరా అనిపించకమానదు. మార్చి నెల రెండవ వారం నుంచి అన్ని గ్రామాలు, పట్టణాల్లో గ్రామ దేవతల సంబరాలు ప్రారంభమవుతాయి. మే నెల మొదటి వారం వరకు ఇవి కొనసాగుతాయి. విభిన్న ఆచారాల కలబోతతో కుల మతాలకు అతీతంగా ఈ ఉత్సవాలు జరుపుకుంటారు.

తీరంలో తీరే వేరు..
ఇక తీర ప్రాంత గ్రామాల్లో ఆలయాల దేవతలు చిత్ర విచిత్రంగా ఉంటారు. అక్కడ ఉండేవి ఆలయాలే కాని నిత్యధూప, దీప, నైవేద్యాలు, పూజలు ఉండవు. కానీ అమ్మవారి ప్రతిమలు ఉంటాయి. కొలిచే భక్తులు కోకొల్లలే వైవిధ్య భరితంగా కనిపించే ఆ ఆలయాల్లో మత్స్యకారులు కొలిచే దేవతలు ఉంటారు. సాధారణంగా గ్రామ దేవతల ఆలయాలలో ఎక్కువ శాతం నిత్య ధూప దీప నైవేద్యాలు ఉండక పోయినా భద్రత ఉంటుంది. ఆలయాలకు తలుపులు, ప్రహారీ గోడలు ఉంటాయి. వాటిలో విగ్రహాలకు కచ్చితమైన రూపురేఖలు ఉంటాయి కానీ ఇక్కడ అవేమీ కనిపించవు. మత్స్యకారులు మనస్సులోనే అమ్మను తలచుకుంటూ ఆమైపె భారం వేసి జీవనోపాధికి వెళుతుంటారని చెబుతున్నారు. తీర ప్రాంత గ్రామాలలో మాత్రమే కనిపించే ఈ ఆలయాలు ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయి. నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంపై చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తమతమ ఇష్టదైవాలైన అమ్మవార్లకు మొక్కుకుని వేటకు వెళుతుంటారు. దానికి అనువుగా నిర్మించుకున్న ఆలయాలు చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.

ఆద్యంతం ఆకట్టుకునేలా..
అత్యంత నియమ నిష్టలతో మత్స్యకారులు చేసే అమ్మవారి జాతరలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. సాధారణంగా మత్స్యకారులు పూజించే అమ్మవార్ల పేర్లు నేరేళ్లమ్మ, భాగిర్తమ్మ, బంగారమ్మ, గంగమ్మ, కాశిమ్మ, పోలేరమ్మ, చినతల్లి, పెదతల్లి అనేటి వంటి అనేక పేర్లతో పిలుచుకుంటారు. ఇతర ప్రాంతాల్లో ముత్యాలమ్మ, నక్కుళ్లమ్మ, సత్తెమ్మ, బోడ కొండమ్మ, నూకాలమ్మ, మరిడమ్మ, మావుళ్లమ్మ తదితర పేర్లతో పిలుస్తుంటారు.

దోషాలు పోతాయని
అమీనాబాద గ్రామంలో పోలేరమ్మ జాతరలో ఒక దున్న పోతును జాతరకు ముందు కొన్ని నెలల నుంచి పెంచి పోషించి ప్రత్యేక పూజల అనంతరం దానితో తొక్కించుకుంటారు. గ్రామంలో ప్రజలు స్నానాలు చేసి వరుసగా నేలపై పడుకుని ఉండగా దున్నపోతును వారిపై నుంచి నడిపిస్తారు. దున్నపోతు గిట్టలు తమ శరీరాలకు తగిలితే వారికి ఉన్న రోగాలు పోతాయని వారి ఆచారంగా స్థానికులు చెబుతారు.

పూర్వం నుంచీ..
ఉప్పాడ శివారు కొత్తపట్నంలో వేంచేసియున్న గ్రామ దేవత నేరేళ్లమ్మ జాతరలో అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఊళ్లో యువకులంతా కలిసి కర్రలతో కాపాలా కాస్తారు. నైవేద్యం సమర్పించే టప్పుడు దుష్టశక్తులు ఏవీ రాకుండా కర్రలతో కొడుతు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఇక్కడ పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారంగా స్థానికులు చెబుతున్నారు.

ఏడాదిలో ఒకటే పండగ
సాధారణంగా గ్రామ దేవతల ఆలయాలలో ఎక్కువ శాతం వారానికి ఒక సారైనా సాధారణ పూజలు చేస్తుంటాం. కానీ గ్రామ దేవతల ఆలయాలలో దేవతలకు మాత్రం ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తాం. కఠికమైన నియమనిష్టలతో ఉపవాసాలు ఉండి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అగ్నిగుండాలు తొక్కడం వంటి కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తాం. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాలను సుందరంగా తీర్చిదిద్ది ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తాం. మా ఆచారం ప్రకారం అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు దుష్టశుక్తులు రాకుండా కాపాలా కాస్తుంటాం.-వనమాడి జగన్నాథం, కొత్తపట్నం, ఉప్పాడ

మా తాతల నాటి నుంచీ..
మా తాతల కాలం నుంచీ దున్నపోతుతో తొక్కించుకోవడం ఆచారంగా వస్తోంది. ఇది చాలా నిష్టగా చేస్తారు. మా గ్రామంలో అమ్మోరులుగా కొందరు మహిళలు ఉంటారు. వారికి దండలు వేసి అమ్మవారిగా భావిస్తారు. గ్రామస్తుల కింద పడుకుని ఉండగా వారిపై నడిపిస్తారు. వీరితో పాటు దున్నపోతును నడిపిస్తారు. ఇలా చేయడం వల్ల మా గ్రామంలో ఉన్న దోషాలు పోతాయని నమ్ముతాం.– నక్కా మణికంఠ,సర్పంచ్‌