భక్తవరదుడైన సత్యదేవుడు.. దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవీ సమేతుడై.. ఆ పరమేశ్వరునితో కలసి రత్నగిరిపై ఆలయంలో ఒకే పీఠంపై కొలువుతీరిన మహామహిమాన్విత క్షేత్రం అన్నవరం. రాష్ట్రం, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఈ దివ్య సన్నిధానానికి తరలి వస్తూంటారు. ఈ సుప్రసిద్ధ హరిహర క్షేత్రంలో నూతనంగా నిర్మించిన ఆలయానికి పుష్కర కాలం పూర్తయ్యింది. ఈ సందర్భంగా సోమవారం నూతన ఆలయ 13వ వార్షికోత్సవం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
చిన్న షెడ్డుతో మొదలై..
శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారు రత్నగిరిపై 1891 సంవత్సరంలో (ఖర నామ సంవత్సరం) శ్రావణ శుద్ధ విదియ నాడు రత్నగిరిపై ఆవిర్భవించారని ఆలయ చరిత్ర చెబుతోంది. అప్పట్లో స్వామివారికి చిన్న షెడ్డు వంటి ఏర్పాటు మాత్రమే ఉండేది. అక్కడే పూజలు చేసేవారని పెద్దలు చెబుతారు. అనంతరం అన్నవరం గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తుల సహకారంతో చిన్నపాటి ఆలయం నిర్మించారు. దీని స్థానంలో 1933–34 కాలంలో గతంలో ఉన్న ఆలయాన్ని నిర్మించారు.
2011లో
ఆ పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో 2011లో అప్పటి ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) కె.రామచంద్ర మోహన్ హయాంలో నూతన గర్భాలయాన్ని నిర్మించారు. సత్యదేవుడు, అమ్మవారు, ఈశ్వరుల మూలవిరాట్టులను కదపకుండా.. ఆ మూర్తులపై టేకుతో తయారు చేసిన పెద్ద పెట్టెను ఉంచి.. దానిపై ఇనుప గడ్డర్లతో పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేసి.. పాత ఆలయాన్ని తొలగించి, నూతన ఆలయాన్ని నిర్మించారు. వాస్తవానికి నూతన ఆలయ నిర్మాణానికి చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. కొంతమంది పాత ఆలయాన్ని తొలగించడానికి వీలు లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో ఫిర్యాదీలు అత్యున్నత సుప్రీంకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. సుమారు ఏడాది పాటు నూతన ఆలయ నిర్మాణం జరిగింది. ఆ సమయంలో వచ్చిన భక్తుల కోసం బాలాలయం ఏర్పాటు చేసి, అక్కడే దర్శనాలు కల్పించేవారు. మూలవిరాట్టుకు నిత్య పూజలు, నివేదనలు పండితులు యథాతథంగా నిర్వహించేవారు. పునాది స్థాయి నుంచీ గ్రానైట్ రాళ్లతో పాత ఆలయం మాదిరిగానే రెండు అంతస్తుల్లో కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఈ నూతన ఆలయాన్ని ఫాల్గుణ బహుళ సప్తమి (2012 మార్చి 14) నాడు అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా కలశ స్థాపన చేసి ప్రారంభించారు. అప్పటి నుంచీ తెలుగు తిథుల ప్రకారం ఫాల్గుణ బహుళ సప్తమి నాడు నూతన ఆలయ కలశ ప్రతిష్ఠ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఈ వేడుకలు సోమవారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కూడా ఆలయ ఈఓగా రామచంద్ర మోహనే ఉండటం విశేషం. త్వరలోనే నూతన ఆలయం స్వర్ణ కాంతులను కూడా అద్దుకోనుంది. తిరుపతి తదితర ఆలయాల మాదిరిగానే సత్యదేవుని గర్భాలయానికి కూడా బంగారు రేకు తాపడం చేయనున్నారు.
నేడు ప్రత్యేక పూజలు
నూతన ఆలయ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం తెల్లవారుజామున సత్యదేవుడికి, అమ్మవారికి, శంకరులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బూరెలు, పులిహోర, రవ్వకేసరి ప్రసాదాలను నివేదించి, భక్తులకు పంపిణీ చేస్తారు. అలాగే, స్వామివారి గోధుమ నూక ప్రసాదం కూడా పంపిణీ చేస్తారు. దేవస్థానం ప్రాంగణంలో రామాలయం ఎదురుగా ఉన్న సర్క్యులర్ మండపంలో ఈ పంపిణీ జరుగుతుంది. వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి ఆలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించాలని ఈఓ రామచంద్ర మోహన్ ఆదేశించారు.