నంద్యాల, సంఘమిత్ర సేవాసమితి (సేవా భారతి) నలమల అడవుల్లోని 40 చెంచు గూడేలను దత్తత తీసుకుని గత కొద్ది సంవత్సరాలుగా నిరంతర వైద్య సేవల అందించడం తో పాటు, గత సంవత్సరం నుండి నంద్యాల ఐయమ్ఏ మహిళా విభాగం సహకారంతో అంతరించిపోతున్న చెంచుల జనాభా అభివృద్ధికి అతి కీలకమైన ప్రసూతి వైద్య సేవలు ప్రతి నెలా అందిస్తూవస్తోంది.
అవగాహనా రాహిత్యం, ఆర్థిక వెనుక బాటు, అలభ్యత కారణంగా చాలా మంది గిరిజన మాతృమూర్తులలో పోషకాహార లోపం, రక్తం లేమితో బాధ పడుతున్నట్టు ప్రధానంగా గుర్తించడం జరిగింది. అలా గుర్తించిన వారందరికీ రక్త పరీక్షలు చేసి అవసరమైన రక్తవృద్ధి టానిక్కులను అందజేశారు.
అందులో భాగంగా భైర్లుటి చెంచుగూడెం నందు 50 మంది చెంచు గిరిజన చెంచు మహిళలకి రక్త వృద్ధి పెంపొందేలా పౌష్టికాహార పంపిణీ డబ్బాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా సేవా భారతి కోఆర్డినేటర్ సి. వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ చెంచు మహిళలందరూ రక్త వృద్ధికి బలమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అలాగే పంపిణీ చేసిన పౌష్టికాహారాన్ని డబ్బాలను పాలతో కానీ నీళ్లలో కానీ కలిపి తీసుకోవాలని.. IMA మహిళా డాక్టర్ల సహకారంతో ఈ పౌష్టికారాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర సేవా ప్రముఖ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.