NewsSeva

వైభవంగా జరిగిన అభ్యాసికల బాలమేళా

319views

నంద్యాల, సంఘమిత్ర సేవా సమితి, సేవాభారతి గత సంవత్సరంగా నంద్యాల, పరిసర గ్రామాల్లోని 20 సేవా బస్తీలలోని పాఠశాల విద్యార్థులకు ఉచిత ట్యూషన్ తరగతులు నిర్వహిస్తూ, పాఠశాల అనంతరం విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయటంతో బాటు విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలను, మానవీయ విలువలను అందిస్తున్నారు. నంద్యాలలో ఈ సేవా ప్రస్థానం మొదలై సంవత్సరం పూర్తైన శుభ సందర్భంగా విద్యార్థుల ప్రతిభా పాఠవాల ప్రదర్శనకు బాలమేళా వార్షికోత్సవం నిర్వహించారు. విద్యార్థులు సనాతన సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా చక్కటి ప్రదర్శనలు చేశారు.

ఈ కార్యక్రమం సంఘమిత్ర అధ్యక్షులు, సభాధ్యక్షులు కర్నాటి నాగసుబ్బారెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవగా ముఖ్య అధితులుగా శ్రీమతి ఉలపు లీలావతి దేవి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, I.C.D.S, ఆత్మకూరు, దేశం కృష్ణారెడ్డి, ఆడిటర్, సంఘమిత్ర కార్యదర్శి చిలుకూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.

సభాధ్యక్షులు కర్నాటి నాగసుబ్బారెడ్డి అధ్యక్షుని తొలిపలుకులలో సంఘమిత్ర సేవా సన్నదతను వివరించారు.చిలుకూరు శ్రీనివాస్ కార్యదర్శి నివేదికలో సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసం, అభ్యాసికల తో పాటు, దత్తత తీసుకున్న 40 చెంచుగూడేలలో వైద్య సేవలు, స్వచ్చ భారత్, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైద్య శిబిరాలు లాంటి సేవా ప్రకల్పాలనీ వివరించారు‌

ప్రధాన వక్త వేణుగోపాల నాయుడు రాష్ట్రీయ స్వయం సేవక్-ఆర్.యస్.యస్. ప్రాంత కార్యవాహ, ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతూ ఈ సేవాప్రకల్పం యొక్క గొప్పతనాన్ని, నేటి సామాజిక సంక్షుభిత పరిస్థితుల్లో రేపటి పౌరులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకతను, ఆ దిశలో సేవాభారతి రాష్ట్రమంతటా చేపడుతున్న వివిధ ప్రకల్పాలనీ వివరించారు.

చిన్నపిల్లలు ఎలా ఉండాలి, ఆ పిల్లల అవసరాలు ఏమిటి, వాటికి తన వంతు బాధ్యతగా చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా తను చేస్తున్న విషయాలను ఇటువంటి పిల్లలకు సాంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్న సంఘమిత్ర సేవా కార్యక్రమాల గురించి శ్రీమతి లీలావతి గారు కొనియాడారు. దేశం కృష్ణారెడ్డి గారు సంఘమిత్ర కార్యక్రమాల గురించి తనదైన శైలిలో వివరించారు. ఈ కార్యక్రమంలో విభాగ కార్యదర్శి సురేంద్ర సంఘమిత్ర కార్యవర్గ సభ్యులందరూ పాల్గొన్నారు.

అలాగే బాలమేళా వార్షికోత్సవంలో నంద్యాల ప్రాంతంలోని 20 అభ్యాసికల విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రామాయణం ఒక చిన్న నాటకం అందరినీ ఆకట్టుకుంది, అలాగే ఒక నిప్పు కోడి కుటుంబం ఎలా ఉంటుంది అనే కథానిక చాలా బాగా ఆకట్టుకుంది, విద్యార్థులు సంక్రాంతి పండుగ విశేషాలను, రంగురంగుల జీవితాలను అన్నింటిని ఆకట్టుకునేలా ప్రదర్శించారు, వచ్చిన అతిధులు అందరూ ఈ కార్యక్రమాలను ఆనందిస్తూ చిన్నారులందరినీ అభినందించారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఏర్పాటు కావడానికి ఇలాగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన సంఘమిత్ర కార్యవర్గ సభ్యులను, వచ్చిన అతిధులను మరియు తల్లిదండ్రులను సంఘమిత్ర సేవా సమితి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు విష్ణు వర్ధన్ రెడ్డి, అభిరుచి మధు, మేడా మురళీధర్, శివనాగిరెడ్డి, నంద్యాల ఐయమ్ఏ సభ్యులు తల్లిదండ్రులు అన్ని అభ్యాసికల విద్యార్తినీ విద్యార్థులు సుమారు 700 మంది పాల్గొని ఈ కార్యక్రమానికి ఒక పండుగ వాతావరణం తెచ్చారని చెప్పడానికి ఆనందిస్తున్నాము. విద్యార్థుల తల్లిదండ్రులు తో పాటు సంఘమిత్రను హార్థికంగా, ఆర్థికంగా అందుకుంటున్న ఆత్మీయ బంధువులందరితో సభాస్థలి పండుగ వాతావరణంతో కోలాహలంగా కనిపించింది.

ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన ఆత్మీయులందరికి కార్యక్రమం నిర్వాహకులు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.జాతీయ గీతాలాపనతో బాలమేళా వార్షికోత్సవ సభ సుసంపన్నమైనది.