News

శ్రీశైలం ప్రసాదంలో కనిపించింది ‘ఎముకలు’ కాదు.. దాల్చినచెక్క : ఈవో

80views

ఆలయ ప్రసాదంలో ఎముకలు ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన భక్తుడు చేసిన ఆరోపణలను శ్రీశైలం దేవస్థానం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నివేదిక తిరస్కరించింది.

శుక్రవారం శ్రీశైలం ఆలయానికి వచ్చిన హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఆలయంలో విక్రయించిన పులిహోర ప్రసాదంలో రెండు ఎముకలు కనిపించాయంటూ ఆరోపించాడు. ఆలయంలో తీసుకున్న పులిహోర ప్యాకెట్‌లో కనిపించిన గుర్తు తెలియని వస్తువులను ఎముకలుగా భావించి భక్తుడు అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో తను చూసిన ఆదారాలను అందించాడు. దీంతో శ్రీశైలం దేవస్థానం నిర్వాహకులు సత్వరమే స్పందించి విచారణకు ఆదేశించారు. పులిహోరలో వాడిన దాల్చిన చెక్కలను చూసిన భక్తుడు ఎముకలుగా భావించారని ఆలయ కమిటీ విచారణలో తేలిందని ఆలయ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం ఆలయంలో ఆదివారం నాడు ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన హరీశ్‌రెడ్డి అనే భక్తుడు ఆలయంలో దర్శనం అనంతరం తాను తీసుకున్న పులిహోర ప్రసాదంలో ఏవో రెండు ఎముకలను పోలిన ముక్కలు కనిపించడంతో ఆందోళనకు గురయ్యాడు. శివపార్వతుల నిలయం, భూ కౌలస్యంగా భావించే శ్రీశైలం ఆలయం, దక్షిణ భారతదేశంలో పురాతన, పవిత్రమైన అత్యంత ప్రాముఖ్యత కలిగిన జ్యోతిర్లింగ క్షేత్రం. అటువంటి క్షేత్రంలో ఇలాంటి భయంకరమైన ఆరోపణ రావటంతో ఒక్కసారిగా ఇటు భక్తులు, అటు ప్రజల్లోనూ తీవ్ర కలకలం మొదలైంది. ఈ సంఘటన ఆలయ వంటగది సౌకర్యాల పరిశుభ్రత, నిర్వహణ పద్ధతులకు సంబంధించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. దీనిపై విచారణకు ఆదేశించిన శ్రీశైలం దేవస్థానం అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టారు.

ఈ మేరకు.. శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ.. భక్తుడు దాల్చిన చెక్క ముక్కలను చూసి ఎముకలుగా భావించారని, ఆలయ కమిటీ విచారణలో ఆయన మాటలు అబద్ధమని తేలిందని వెల్లడించారు. శ్రీశైలం ఆలయంలో ప్రసాదాల తయారీలో ఎప్పుడూ ప్రామాణికమైన నిర్వహణ విధానాలు పాటించడం వల్ల ఇలాంటి అపవిత్ర చర్యలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవి పవిత్ర పుణ్యక్షేత్రం అయిన.. ఈ చారిత్రాత్మకమైన శ్రీశైలం పవిత్రతను కాపాడటానికి ఎల్లవేళల కృషి చేస్తున్నామని చెప్పారు. శ్రీశైలం దేవస్థానం నిర్వహణను విశ్వసించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ విజ్ఞప్తి చేశారు ఈవో పెద్దిరాజు.

శ్రీశైల ఆలయంలో ప్రసాదాన్ని పటిష్ట పర్యవేక్షణలో తయారు చేస్తామని శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మార్కండేయశాస్త్రి, వేదపండితులు గంటి రాధాకృష్ణ వివరించారు. శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు వితరణ చేసే పులిహోర ప్రసాదంలో ఎముక వచ్చిందనేది వాస్తవం కాదని తేల్చిచెప్పారు. రోజువారి ప్రసాదాల తయారీ కూడా ప్రధాన అర్చకుల పర్యవేక్షణలోనే జరుగుతుందన్నారు.