
‘యత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవతాః’’ మహిళను గౌరవించి పూజించే చోటనే దేవతలు ఉంటారు అన్నది భారతీయ సంప్రదాయం. వందల యేళ్ళ విదేశీ పరిపాలనలో, పాషండ మతాల దురాక్రమణలో, కొందరు స్వార్థపరుల దురాలోచనలతో మన దేశంలో సైతం మహిళలను మగవారికంటె తక్కువగా హీనంగా చూసే విధానం సర్వసామాన్యమైపోయింది. క్రమంగా ఆ పరిస్థితిలోనూ మార్పు వస్తోంది. సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల అవిరళ కృషితో స్త్రీలను గౌరవించి ఆదరించే భారతీయ ప్రాచీన సంప్రదాయం మళ్ళీ సమాజంలో బలం పుంజుకుంటోంది.
విదేశాలలో స్త్రీని చూసే తీరు వేరు. భారతదేశంలో మహిళను గౌరవించి పూజించే సంస్కృతి వేరు. కాలగతిలో ఎన్ని మార్పులు వచ్చినా మౌలిక ఆలోచనా ధోరణి మారలేదు. సరస్వతి, లక్ష్మి, పార్వతి… ఇలా భిన్న అవతారాల్లో మాతృమూర్తిని గౌరవించుకుంటాం. తల్లికి నమస్కరించిన తర్వాతే ఏ దేవుడికైనా నమస్కరించుకుంటాం. చిన్నపిల్లలకు సైతం కుమారీపూజ చేసే సంప్రదాయం మనది. శక్తిస్వరూపిణిగా అమ్మలగన్నయమ్మగా ఆరాధించే సంస్కృతి మనది.
వందలయేళ్ళ ఇస్లాం, క్రైస్తవ దురాక్రమణదారుల పాలన ప్రభావంతో సమాజంలో పెడధోరణులు ప్రబలిన మాట వాస్తవమే. మహిళలపై అణచివేతలూ దౌర్జన్యాలూ మనకళ్ళముందరి నిజాలే. ఆ పరిస్థితిని మార్చాలంటే కఠిన దండనలూ ఉండాలి, మానసిక పరివర్తనలూ రావాలి. తప్పు చేసినవాళ్ళని శిక్షించడంతో పాటు, తప్పుడు ఆలోచన కలగకుండా చేసే సంస్కారాన్నీ అందించాలి. అలాంటి ప్రయత్నమే చేస్తోంది ‘సేవా భారతి’.
భారతీయ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా ‘సేవాభారతి’ స్వచ్ఛందసంస్థ అవిరళ కృషి చేస్తోంది. బాలికా విద్య, మహిళా సాధికారత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పలురకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే భాగ్యనగరంలో రేపు ఆదివారం అంటే 11 ఫిబ్రవరి 2024న ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’ పేరుతో మారథాన్ నిర్వహిస్తోంది.
సేవాభారతి తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో భాగ్యనగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’ కార్యక్రమం ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం నిర్వహించడం ఇది ఎనిమిదోసారి. ఇందులో భాగంగా 5కె, 10కె, 21కె అనే మూడు విభాగాల్లో మారథాన్ రన్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ‘రితమ్’ సంస్థ మీడియా భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
సేవాభారతి సంస్థ దేశవ్యాప్తంగా 263 మురికివాడల్లో సేవలందిస్తోంది. బాలికలు, యువతులు, మహిళల పట్ల గౌరవప్రదమైన ఆలోచనాధోరణి కలిగి ఉండాలని బస్తీల నివాసులకు బోధిస్తోంది. ఇప్పటికి 10వేల మందికి పైగా బాలికలకు చదువుకునే అవకాశం కల్పించి, వారు తమకాళ్ళపై తాము నిలబడేలా తీర్చిదిద్దుతోంది. 2030 నాటికి కనీసం లక్షమంది బాలికలు, మహిళలు సాధికారతను సంపాదించుకునేలా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ‘బేటీ పఢావో – బేటీ బచావో’ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును అందిపుచ్చుకుని బాలికా విద్య గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. బాలికా విద్య, మహిళా సాధికారత గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం మనందరి బాధ్యత.