అనేక వేల సంవత్సరాలుగా భారతీయ సమాజం సుఖశాంతులతో జీవిస్తోంది. గట్టి పునాదుల మీద సుదీర్ఘకాలం నిలిచి ఉన్న మన కుటుంబ వ్యవస్థ అనేక విదేశీ దాడులను ఎదుర్కుని, తట్టుకుని నిలచింది. కానీ భౌతిక భోగ సంస్కృతికి చెందిన పాశ్చాత్య దేశాల్లోని సమాజ జీవనం కేవలం 700 సంవత్సరాలలోనే విచ్ఛిన్న దశకు చేరుకుంటోంది.
కుటుంబ విచ్ఛిన్నం, వైవాహిక జీవన వైఫల్యం, తల్లిదండ్రులు లేని సంతానం వంటి సమస్యలు అక్కడి సమాజాన్ని వేధిస్తున్నాయి. సుస్థిర కుటుంబ వ్యవస్థ లేని కారణంగా అక్కడి మహిళలు ఎంత సంపద ఉన్నప్పటికీ ఒంటరితనం, నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత మంచి లక్షణాలతో బాధపడుతూ జీవిస్తున్నారు. అయితే అలాంటి సమాజపు ప్రభావం వలన జాతీయ కుటుంబ వ్యవస్థకు కూడా కొంత దెబ్బ తగిలింది.
విదేశీ బహుళజాతి సంస్థల ఆక్రమణ ఆర్థిక రంగంలోనే కాక సాంస్కృతిక రంగంలోనూ ప్రభావం చూపుతోంది. ధనిక కుటుంబాల నుండి పేద కుటుంబాల వరకూ జీవన విధానం ఎన్నో మార్పులకు గురవుతోంది. సాధారణంగా ఏ దేశంలోనైనా కొత్త కొత్త పద్ధతులను ధనికులు ఆచరిస్తారు. వారిని చూసి ఇతరులు అనుసరిస్తారు. అలాగే స్వాతంత్ర్యానికి పూర్వం మనదేశంలోనూ విదేశాలలో విద్యను అభ్యసించి వచ్చిన సంపన్నులు, స్వదేశంలోనూ విదేశీ విద్యను మెండుగా అభ్యసించిన వారు వేషభాషలలోనూ, ఆచార్య వ్యవహారాలలోనూ పాశ్చాత్యులను అనుసరించారు. ఇక సామాన్యులు సైతం మన దేశంలోని సంపన్నులను అనుసరిస్తూ రావడంతో మనపై పాశ్చాత్య ప్రభావం బాగానే పడింది.
రామాయణంలో శ్రీరాముని పట్టాభిషేకాన్ని చూడడానికి ఎన్నో దేశాల నుంచి వచ్చిన అతిథులు ఎన్ని నెలలైనా తిరుగు ప్రయాణం మాట తలపెట్టలేదు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో అతిథులకు సముచిత సత్కారాలు చేసి వీడ్కోలు పలకమని ఆదేశిస్తాడు. అది విని ఆశ్చర్యపోయిన లక్ష్మణుడితో రాముడు ” నాయనా! వారు వివిధ దేశాలకు, జాతులకు చెందినవారు. వారి సంస్కృతి వేరు. భాష వేరు. వారి ప్రభావం అయోధ్య ప్రజలపై పడటం శ్రేయస్కరం కాదు.” అన్నాడు.
లక్షల సంవత్సరాల నాటి రామాయణ కాలంలోనే తన దేశ ప్రజలపై ఇతర దేశాల సంస్కృతి ప్రభావం పడకుండా శ్రీరాముడు తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం గానీ ప్రజలు గాని తీసుకోవడం లేదు. ఈరోజు విదేశీ వస్తువులు ప్రతి కుటుంబంలోనికీ చేరుతున్నాయి. విదేశీ ఆచార వ్యవహారాలు, వస్త్రధారణ మన చుట్టూ చేరాయి. ఉద్యోగాలు చేసే గృహిణులే కాదు, ఉద్యోగాలు చేయని అనేక కుటుంబాల్లోని మహిళలు వంట చేసి అమ్మవారికి భోజనం పెట్టే బాధ్యతను ఆనందంగా నెరవేర్చడం లేదు. తల్లి ఇంట్లోనే ఉన్నా పిల్లలు, భర్త బయటి నుండే ఆహారాన్ని తెచ్చుకుని తింటున్నారు. ఆ అలవాటు కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తోంది. అంతేకాకుండా అనేక కుటుంబాలలో విదేశీ సంస్థలు ఆకర్షణీయమైన ప్యాకింగులతో విక్రయిస్తున్న ఆహారపదార్థాల వినియోగం కూడా బాగా పెరుగుతోంది. ఇలాంటి పరిణామాలు ఏ మాత్రం వాంఛనీయం కాదు. ఇవి మన శారీరిక ఆరోగ్యాన్నే కాదు, కుటుంబ ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తాయి.
మన కుటుంబాలలో, మన ఆచార వ్యవహారాలలో, మన అలవాట్లలో, మన వేషభాషల్లో, మన నడవడిలో పాశ్చాత్య ప్రభావం వీలైనంత తక్కువ ఉండేలా మనం జాగ్రత్తపడాలి. పాశ్చాత్య ధోరణులను పెంచేలా, ప్రోత్సహించేలా టీవీలలో, సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న విష ప్రచారానికి మన సంతానాన్ని దూరంగా ఉంచాలి. వాటి వల్ల కలిగే దుష్ఫలితాలను వారికి వివరించాలి.
పరిస్థితులను అర్థం చేసుకుని వారికై వారే పాశ్చాత్య పెడ పోకడలకు దూరం జరిగేలా వారికి అవగాహన కలిగించాలి. ముఖ్యంగా కళాశాలలు, యూనివర్సిటీలలో చదివే విద్యార్థినీ విద్యార్థులపై ఆ ప్రభావం పడే అవకాశం చాలా ఎక్కువ. అటువంటి వారు స్వయంగా యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉండేలా వారికి తగిన అవగాహనను కలిగించాలి. రామాయణ భారత భాగవతాలను, హిందూ పురాణేతిహాసాలను వారికి బాల్యం నుంచే బోధించడం ద్వారా వారికి భారతీయ సంస్కృతి పట్ల అవగాహనను, అనురక్తిని కలిగిస్తే…. ఆ జ్ఞానమే, ఆ అవగాహనే వారు యుక్తవయస్సులో పెడత్రోవ పట్టకుండా కాపాడుతుంది. ఆ విధంగా మనం మన కుటుంబాలను, హిందూ కుటుంబాల విశిష్టతను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
-ప్రభాకర్ రాజు