నల్లమల అడవులలో నివసించే గిరిజన చెంచుల ఆరోగ్య పరిరక్షణకు నంద్యాల సేవాభారతి, సంఘమిత్ర సేవా సమితి అధ్వర్యంలో నంద్యాలలోని ఐ.యమ్.ఏ మహిళా విభాగం వైద్యులతో ఉచిత ప్రసూతి, శిశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
అందులో భాగంగా నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని శివపురం, ఎర్ర కుంట, పాలెం చెరువు, చదరం పెంట గూడెం లోని చెంచులకు వైద్య శిబిరాలు నిర్వహించారు. గత సంవత్సరంగా ప్రతినెలా క్రమం తప్పకుండా ఈ వైద్య శిబిరాలను ఈ సేవా సంస్థలు నిర్వహిస్తున్నాయి.
ఈ వైద్య శిబిరాల్లో డాక్టర్ సత్య శివ సుందరి, డాక్టర్ సరిత, డాక్టర్ మధు ప్రీతి, డాక్టర్ శిరీష మరియు డాక్టర్ కాదర్ బాద్ ఉదయ శంకర్ లు పాల్గొని 94 మంది మహిళలు, పురుషులు మరియు పిల్లలకు పరీక్షలు నిర్వహించి, మందులు టానిక్కులను ఉచితంగా అందజేశారు. పోషకాహారము, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన ఆరోగ్య సలహాలను ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సేవా భారతి ప్రాంత సహ సేవా ప్రముఖ్ మనోహర్, భక్త కన్నప్ప గురుకులం ఆవాస కార్యదర్శి ఎం.రఘు రాములు, సి.వాసుదేవ రెడ్డి, యన్.శ్రీనివాసులు, యమ్.రామకృష్ణలతో పాటు స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.