3రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమికి కారణం సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే : ఆచార్య ప్రమోద్ కృష్ణమ్

సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినందుకు ఉత్తరాదిలో కాంగ్రెస్‌కు ఈ గతి పట్టిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రమోద్ కృష్ణమ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ఓటమి పాలవ్వడంతో ఈ వాఖ్యలు చేశారు.
సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినందుకే కాంగ్రెస్ నావ మునిగిపోతోందని ఆయన హెచ్చరించారు.ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆయన స్పందిస్తూ `సనాతన్ కా శాప్’ అని ట్వీట్ చేశారు. అనంతరం ఆయన ఇదే విషయమై స్పందిస్తూ కాంగ్రెస్ అంటేనే గాంధీ రఘుపతి రాఘవ రాజారాం అన్న సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్న పార్టీ అని ప్రజలు భావిస్తారని గుర్తు చేసారు.
కానీ ఇప్పుడది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పయనిస్తోందని పేర్కొంటూ ఒకవేళ కాంగ్రెస్ గనక ఈ వామపక్ష నాయకులను పార్టీ నుంచి బహిష్కరించకుంటే అది కూడా ఎఐఎమ్ఐఎమ్ లా మారుతుందని ధ్వజమెత్తారు. ఈ దేశం కుల రాజకీయాలను ఎప్పటికీ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. “సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం వలన పార్టీ మునిగిపోయింది. మన దేశంలో క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎప్పుడూ పనిచేయవు. ఇది కేవలం సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన కారణంగా కలిగిన శాపం ఫలితం”… అంటూ ఆచార్య ప్రమోద్ తెలిపారు.
మూడు రాష్ట్రాల ఎన్నికలలో ఓటమికి కారణం సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే అని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే తమ ఓటమికి కారణమైందని కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ అభిప్రాయపడ్డారు.