
( డిసెంబర్ 4 – ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి )
యుగళ గీతమైనా, విషాద గీతమైనా, భక్తి గీతమైనా, ప్రేమగీతమైనా, హాస్య గీతమైనా … సినిమాలో సందర్భానుసారంగా వచ్చే పాటలో భావోద్వేగాలను పలికించడంలో ఆయనకు ఆయనేసాటి. తేనెలూరు ఆ స్వరరాగ గంగా ప్రవాహంలో తడవని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తికాదు. గాయకులు చాలామంది ఉంటారు. కానీ గంధర్వ గాయకులు శతాబ్దానికి ఒక్కరో ఇద్దరో జన్మిస్తారు. నాటికి, నేటికీ, ఎప్పటికీ గంధర్వ గాయకుడు ఘంటసాల. తెలుగువారికి అమృతధార రస స్వర ఝరితో అపరిమిత గానామృతాన్ని పంచిన అమరగాయకుడు ఘంటసాల. అంతెందుకు మాస్టారు అని పిలవబడే గౌరవాన్ని అందుకున్న గాయకుడు మన ఘంటసాల మాస్టారు ఒక్కరే.
ఇంటిపేరుతోనే ప్రసిదులైన ఘంటసాల పూర్తి పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆయన 1922 డిసెంబర్ 4 వ తేదిన కృష్ణా జిల్లాలోని చౌటుపల్లి గ్రామంలో జన్మించారు. తండ్రి సూర్య నారాయణ రావు తల్లి రత్తమ్మ. ఘంటసాల చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తిని కనబర్చేవారు. సంగీతాన్ని అభ్యసించడానికి అప్పటి ఆంధ్రరాష్ట్రంలో ఉన్న ఏకైక సంగీత కళాశాలైన విజయనగరం సంగీత కళాశాలలో, ఐదేళ్లు పట్రాయని సీతారామశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకుని డిప్లొమా పట్టాను పొందారు. తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసారు. స్వాతంత్ర్య సమరయోధునిగా 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో సైతం పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. 1944 ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని గారిని వివాహం చేసుకున్నారు.
కచేరీలు చేస్తున్న సమయంలో ఘంటసాల సామర్థ్యం గ్రహించిన చిత్తూరు నాగయ్య , బీఎన్ రెడ్డి తాము తీస్తున్న స్వర్గసీమ చిత్రంలో తొలిసారి నేపధ్య గాయకుడిగా అవకాశమిచ్చారు. అలా స్వర్గసీమ చిత్రంతో తొలిసారిగా నేపధ్య గాయకునిగా సినీరంగ ప్రవేశం చేశారు ఘంటసాల. ఘంటసాలతోనే తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రలోని ఒక మహోజ్వలమైన, మహత్తరమైన ఘంటసాల శకం ఆరంభమైందని చెప్పవచ్చు. దేవదాసు, లవకుశ, పాతాళ భైరవి, మిస్సమ్మ, మూగమనసులు, గుండమ్మ కథ, మహాకవి కాళిదాసు, డాక్టర్ చక్రవర్తి, జీవనతరంగాలు వంటి చిత్రాలకు పాడి ఎలాంటి పాటనైనా ఘంటసాల పాడగలరన్న ఖ్యాతి సంపాదించారు. గాయకునిగా ఎంతటి పేరు సంపాదించారో సంగీత దర్శకునిగానూ ఘంటసాల అంతటి ఘనతను సొంతం చేసుకున్నారు.మనదేశం చిత్రంతో తొలిసారి సంగీతదర్శకునిగా మారారు. తెలుగువారికి కీర్తి కీరీటం వంటి మాయాబజారు చిత్రానికి ఘంటసాలనే సంగీతదర్శకుడు
తెలుగువారికే సొంతమైన పద్యాలలోనూ, తన పద్య గానంతోనూ ఆకట్టుకున్నారు. లవకుశ, పాండవ వనవాసం, నర్తనశాల సినిమాలలో ఘంటసాల గాత్రం నుండి జాలువారిన పద్యాలు ప్రసిద్ధి పొందాయి.సుమారు మూడు దశాబ్దాలకు పైగా ఘంటసాల పాటలు తెలుగునాట ఇంటింటా ప్రతిధ్వనిస్తూనేవున్నాయి. చలనచిత్రాలలో, రేడియోలో, గ్రామఫోను రికార్డులలో ఆయన గాత్రం శ్రోతలను రసపరవశులను చేసింది.
జగదేకవీరుని కథ చిత్రంలోని శివశంకరీ శివానందలహరి పాటలో ఘంటసాల తన అనన్య సామాన్య ప్రజ్ఞతో కర్ణాటక సంగీతంలో క్లిష్టమైన దర్బారీ కానడ రాగాన్ని పాడిన తీరు శ్లాఘనీయం. సినీ సంగీత ప్రపంచంలో పలువురు గాయకుల ప్రతిభని తెలుసుకోవటానికి ఈ పాటనే కొలమానంగా పాడిస్తారు. ఈ గీతం ఘంటసాల గాన ప్రతిభకి తార్కాణంగా చెప్పవచ్చు. ఘంటసాల 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని శేషశైలావాస శ్రీ వేంకటేశ పాటను పాడి ఆ సన్నివేశంలో నటించారు కూడా. ఘంటసాల పాడిన పాటలన్నీ ఒక ఎతైతే ఆయన ఆలపించిన భగవద్గీత ఒక ఎత్తు. ఆయన గానం చేసిన భగవద్గీత తెలుగునాట ప్రసిద్ధి పొందింది. ఇలా ఘంటసాల గాన వైభవం గురించి చెప్పుకోవడం చర్వితచర్వణమే అవుతుంది. సంగీత ప్రపంచానికి రారాజుగా వెలిగిన ఘంటసాల మధుర కంఠం 1974 ఫిబ్రవరి 11న శాశ్వతంగా మూగబోయింది.
1970లో ఘంటసాలని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా నియమించింది. ఘంటసాల గౌరవార్ధం భారత తపాలాశాఖ తపాలాస్టాంపును విడుదలచేసింది. ఘంటసాల వెంకటేశ్వరరావు పేరుతో విజయవాడలో ప్రభుత్వ సంగీత కళాశాలని ఏర్పాటు చేశారు.
తెలుగువారికి అపరిమితమైన మధురామృతాన్ని పంచి, తన గానంతో శ్రవనానందం కలిగించి, స్వర కల్పనతో జనాన్ని మంత్రముగ్ధుల్ని చేసి, తెలుగు వారి హృదయాలలో చలనచిత్ర సంగీత సామ్రాజ్య సామ్రాట్ గా నిలిచిపోయిన తొలితరం గాయకుడు ఘంటసాల. తన పాట ప్రతి నోట పలికించిన మధుర కంఠశాల మన ఘంటసాల మాస్టారు. తెలుగు పాట ఉన్నంతకాలం ఘంటసాల సంగీత పరిజ్ఞానం, స్వర మాధుర్యం అద్వితీయం, ఆ గంధర్వ స్వర గానానుభుతి అజరామరం.