ArticlesNews

సామాజిక సమరసత సాధకులు ఉన్నవ లక్ష్మీనారాయణ

240views

(డిసెంబర్ 4 – ఉన్నవ లక్ష్మీ నారాయణ జయంతి)

ఇరవయ్యవ శతాబ్దారంభం నాటి భారతీయ పునరుజ్జీవన ఉషస్సులు కొత్త దారులు చూపించాయి. ప్రపంచం నలుమూలలా నాడు సంభవించిన పరిణామాల ప్రభావమూ ఇందుకు దోహదపడింది. మహా సామ్రాజ్యం జార్ రష్యా మీద చిన్న దేశం జపాన్ సాధించిన విజయం భారత స్వాతంత్ర్యోద్యమ దృష్టికి పదును పెట్టింది. ఆ చారిత్రక పరిణామం తరువాత రష్యాలో వచ్చిన బోల్షివిక్ విప్లవాన్ని నాటి భారతీయులు సామాజిక మార్పులో మైలురాయిగా భావించారు. అలాంటి కాలం ఇచ్చిన మహనీయులలో ఒకరు ఉన్నవ లక్ష్మీనారాయణ. రాజకీయ, సంస్కరణోద్యమాలు ఒకవైపు, కొత్త దృష్టితో సాహిత్యోద్యమం మరొకవైపు సాగించిన బహుముఖ ప్రజ్ఞాశీలి ఆయన. బోల్షివిక్ విప్లవం, దాని ఆశయంగా చెప్పే శ్రామికవర్గాల ఉనికి అనే భావనలతో ఉన్నవ లక్ష్మీనారాయణ తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయమైన నవల రాశారు. అదే మాలపల్లి.

లోతైన తాత్త్విక, సామాజిక, రాజకీయ నేపథ్యాలుంటే తప్ప మాలపల్లి వంటి నవల ఆ కాలంలో వెలువడడం సాధ్యపడేది కాదు. అందుకే ఆ నవలకు అంత పఠనీయత, ఖ్యాతి వచ్చాయి. ఉన్నవ గొప్ప సాహిత్యవేత్తగానే కాకుండా, గాంధేయవాదిగా, నిబద్ధతగల స్వాతంత్ర్య సమరయోధుడిగా కూడా తెలుగునాట చరిత్రకెక్కారు. తన కాలానికి తగ్గట్టు సంఘ సంస్కరణను ఆరాధించారు. దానికి అంకితమయ్యారు. ఆయన హరిజనోద్ధారకుడు. స్త్రీ విద్య, వితంతు వివాహాలు ప్రోత్సహించిన సమున్నత సంస్కర్త. రెండు భిన్నకోణాలైన కందుకూరి వీరేశలింగం సంస్కరణ ప్రభావం, గాంధీజీ జాతీయోద్యమ స్పృహ కూడా ఉన్నవ మీద కనిపిస్తాయి.

ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా అప్పటి సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడు గ్రామంలో 1877 డిసెంబర్ 4వ తేదీన శ్రీరాములు, శేషమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగించారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి ఎన్నో గ్రంథాలు చదివి సాహిత్యాభిలాషను పెంపొందించుకున్నారు. 1916లో ఐర్లాండ్, డబ్లిన్‌లలో బారిష్టర్ చదువు సాధించారు. గుంటూరులో స్త్రీ విద్య ప్రోత్సాహానికి 1922లో ‘శారదానికేతన్’ స్థాపించి ఎందరో బాలికలకు చదువుకునే అవకాశం కల్పించారు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహానికి 1922లో నాయకత్వం వహించడమే కాకుండా ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని అరెస్టై జైలుశిక్ష కూడా ఉన్నవ అనుభవించారు.

ఉన్నవ లక్ష్మీనారాయణ 1921లో మాలపల్లి నవలకు శ్రీకారం చుట్టి దేశభక్తి, సంఘ సంస్కరణాభిలాషతో ఆ రచన సాగించారు. ఇందులోని కథానాయకుడు సంగదాసు పాత్ర ద్వారా ఉన్నవ ఆదర్శ సంఘ పునరుద్ధరణకు పూనుకున్నారు. అందువల్ల మాలపల్లి నవలకు ‘సంగ విజయం’ అనే పేరు కూడా ఉంది. నిజానికి ఆయన ముందు నుంచీ కుల వ్యవస్థను నిరసించారు. ‘నాయకురాలు’, ‘బుడబుక్కల జోస్యం’, ‘స్వరాజ్య సోది’, ‘బావ తరంగాలు’ వంటి రచనలతో కూడా ఉన్నవ స్వాతంత్ర్యోద్యమంతో పాటు సాహిత్యోద్యమంలో కూడా తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. హరిజనోద్ధరణ సంస్కరణ దృక్పథంతో వచ్చిన మాలపల్లి నవల ప్రబోధాత్మకంగా, ఆదర్శ సమాజ సంకల్పాన్ని ప్రతిబింబించింది. ఒక కాలపు చరిత్రకు ఛాయగా ఉన్న మాలపల్లి నవల కూడా చరిత్ర సృష్టించింది.

గాంధేయవాదిగా, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, గుంటూరు శారదా నికేతన్ వ్యవస్థాపకుడిగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడిగా గణనీయమైన కీర్తి ప్రతిష్టలు పొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ వారి సతీమణి శ్రీమతి లక్ష్మీబాయమ్మ ఆయనకు చేదోడువాదోడుగా నిలిచి సహకరించారు. దళిత జనోద్దరణ, సామాజిక సమరసత కోసం తన సంపూర్ణ జీవితాన్ని వెచ్చించి 1958 సెప్టెంబర్ 25న ఉన్నవ లక్ష్మీనారాయణ పరమపదించినా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులు.