News

సృష్టి రక్షకులు శివ పార్వతులు

177views

ఆదిదంపతులైన శివపార్వతులు సృష్టిని రక్షిస్తున్నారని మహాసహస్రావధాని, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అభివర్ణించారు. శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన ప్రవచనాలు ఆలోచింపజేశాయి. ఆదిశంకరాచార్యులు రచించిన భ్రమరాంబాష్టకంపై ప్రవచన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతిప్రజ్వలన చేసి ప్రవచనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు ప్రసంగిస్తూ భక్తుడిని భగవంతుడు ఎళ్లవేళలా రక్షిస్తుంటాడని అన్నారు. ఆదిదంపతులైన శివపార్వతులు సృష్టిని అంతా కాపాడుతుంటారన్నారు. అలాగే ప్రసంగంలో శివారాధన విశేషాలు, శివతాండవ విశేషాలను వివరించారు. అదేవిధంగా భ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల నామవైభవం, లీలావైభవం, మహిమావిశేషాలు, శ్రీశైలక్షేత్ర ప్రాశస్త్యం మొదలైన అంశాలను వివరించారు. ప్రవచనం ముగిసిన అనంతరం మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావుకు దేవస్థానం తరపున ఆలయ అధికారులు వేదాశీర్వచనంతో స్వామి, అమ్మవార్ల శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. కాగా ఆలయంలో కూచిపూడి నృత్యప్రదర్శన, భజన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదికపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉజ్వల, వైష్ణవి, సుమ, సహస్ర తదితరులు నృత్యప్రదర్శనతో అలరించారు.