News

హిందూయిజం కాదు, హిందుత్వం అనాలి : వరల్డ్ హిందూ కాంగ్రెస్ తీర్మానం

87views

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశాల రెండో రోజు కీలకమైన తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదించింది. ఇంగ్లీషులో హిందూయిజం అనే పదానికి బదులు హిందూనెస్ (హిందుత్వ) అనే పదాన్ని వాడాలని తీర్మానించారు. ఆ సమావేశంలో 61 దేశాల నుంచి 2000 మందికి పైగా ప్రతినిథులు పాల్గొన్నారు.

హిందూయిజం అనే పదం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని, వారిలోని మంచితనాన్నీ, ఇతర సుగుణాలనూ సరిగ్గా ప్రతిబింబించడం లేదని సమావేశం వ్యాఖ్యానించింది. హిందుత్వ గురించిన ఆ తీర్మానం ఇలా సాగింది.

‘హిందూ ధర్మ’ అనే పదబంధంలో మొదటి పదం హిందూ అంటే ‘పరిధులు లేనిది’ అని అర్థం. అంటే అది సనాతనమూ, అనంత కాలం నుంచి ఉన్నదీ అని అర్ధం. ఇక ధర్మ అంటే ‘ఏదైతే నిలబడుతుందో అది’ అని అర్ధం.

కాబట్టి, హిందూధర్మం అంటే ఎప్పటికీ ఎన్నటికీ నిత్యనూతనంగా నిలిచిపోయే ధర్మం. అది ప్రతీదానికీ వర్తిస్తుంది… ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, ఒక వర్గానికి, ఒక సమాజానికి, ఆఖరికి ప్రకృతికి కూడా వర్తిస్తుంది.

అయితే హిందూయిజం అనేది దానికి పూర్తిగా విరుద్ధమైనది. ‘ఇజం’ అంటే ఒక పీడక ప్రవృత్తి. వివక్ష చూపించే స్వభావం లేదా నమ్మకం. 19వ శతాబ్దం మధ్యలో అమెరికాలో ఈ ఇజం అన్న పదాన్ని వాడడం మొదలు పెట్టారు. తీవ్రవాద సమాజ సంస్కరణా ఉద్యమాలను కానీయండి, లేదా పలు ధార్మిక, ఆధ్యాత్మిక ఉద్యమాలను కానీయండి, నిందాపూర్వకంగా చూపడానికి ‘ఇజం’ అనే పదం కనిపెట్టారు. ఆ నేపథ్యంలో హిందూయిజం అన్న పదాన్ని అర్ధం చేసుకోవాలి.

హిందూయిజం అన్న పదాన్ని మొట్టమొదట నిఘంటువుకెక్కించినది సర్ మోనియర్ విలియమ్స్. అతను ఏకంగా హిందూయిజం పేరిట హ్యాండ్‌బుక్ రాసేసాడు. దాన్ని 1877లో ‘సొసైటీ ఫర్ ప్రమోటింగ్ క్రిస్టియన్ నాలెడ్జ్’ అనే సంస్థ ప్రచురించింది. మేధోపరంగా నిజాయితీ లేని ఆ పదజాలమే గత 150 యేళ్ళుగా విషపూరితమైన హిందూ వ్యతిరేక భావజాల వ్యాప్తి వెనుక ఉన్న అసలైన బీజం.

అందువల్లనే మన పెద్దలు హిందూయిజం అన్న పదానికి బదులు హిందుత్వ అన్న పదానికి ప్రాధాన్యం ఇచ్చారు. హిందుత్వ అన్న పదం మరింత కచ్చితమైనది. హిందూ అనే పదం పరిధిలోకి వచ్చే అన్ని అంశాలూ హిందుత్వలో ఉంటాయి. మనం మన పెద్దలు చెప్పిన విషయంతో ఏకీభవించాలి, హిందుత్వ పదాన్నే కొనసాగించాలి.

హిందుత్వ అనేదేమీ సంక్లిష్టమైన పదం కాదు. దానర్థం చాలా సరళమైనది… ‘హిందూ’తనం. అంతే.

మరికొందరు మరో ప్రత్యామ్నాయ పదాన్ని ఉపయోగించారు. అదేంటంటే ‘సనాతన ధర్మ’ లేదా క్లుప్తంగా ‘సనాతన’. అయితే ప్రస్తుత సమాజంలో చాలామంది విద్యావేత్తలు, మేధావులు హిందుత్వ అనేది హిందూధర్మానికి పూర్తి వ్యతిరేకమైనది అన్నట్లు క్రమం తప్పకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. కొంతమంది తమ అజ్ఞానంతో అలా మాట్లాడతారు. కానీ చాలామంది మాత్రం కావాలనే అలా విషప్రచారం చేస్తారు. దానికి కారణం ఒకటే. హిందూధర్మం పట్ల వారికి ఉన్న గుడ్డి ద్వేషం, వివక్ష. చాలామంది రాజకీయ నాయకులు తమ తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాలూ, వ్యక్తిగత రాగద్వేషాల ఆధారంగా కూడా సనాతన ధర్మాన్ని విమర్శించే గుంపులో చేరిపోయారు. ఇంక సనాతన ధర్మంపై ప్రతీరోజూ విషం చిమ్మడమే వారి పని.

ప్రకటనలోని ఈ భాగం డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చెన్నయ్‌లో చేసిన విద్వేష వ్యాఖ్యల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.

హిందుత్వం, లేక సనాతన ధర్మం లేక హిందూధర్మంపై అలాంటి విషపూరితమైన విమర్శలు చేయడం అంటే హిందూ సమాజమే లక్ష్యంగా దాడి చేయడమేనని అంతర్జాతీయ హిందూ సమాజం తరఫున వరల్డ్ హిందూ కాంగ్రెస్ తీర్మానించింది. నిజానికి హిందూ సమాజం అందమైనది, న్యాయబద్ధమైనది, మంచిది అని ఆ తీర్మానం స్పష్టం చేసింది.

నిజానికి ఈ దాడులు మంచితనంపై జరుగుతున్న దాడులు. వాటిని వరల్డ్ హిందూ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. వ్యవస్థీకృత ప్రయత్నాల ద్వారా హిందుత్వను ప్రపంచమంతా అమలు చేయాలి, హిందూ వ్యతిరేక దాడులకు పాల్పడేవారిని అధిగమించి విజయం సాధించాలి అని….. వరల్డ్ హిందూ కాంగ్రెస్ తమ తీర్మానాన్ని ఆమోదించింది.