కార్తిక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ఆలయ పుష్కరిణి వద్ద వేల మంది భక్తులు దీపాలు వెలిగించారు. ముందుగా భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులను శోభాయమానంగా ముస్తాబు చేసి ఆలయ ప్రాంగణం నుంచి మంగళవాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.
పుష్కరిణి వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి అర్చకులు, వేదపండితులు శ్రీస్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను శాస్త్రోక్తంగా ఇచ్చారు. దశవిధ హారతుల్లో ఓంకార హారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతిలను ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు వీరన్నస్వామి, మార్కండేయశాస్త్రి ప్రత్యేక పూజాదికాలను నిర్వహించి హారతులిచ్చారు. భక్తులు హారతులను కన్నులారా తిలకించి స్వామిఅమ్మవార్లను దర్శించి నేత్రానందభరితులయ్యారు.అనంతరం పుష్కరిణి మెట్ల వద్ద లక్ష కార్తిక దీపాలు వెలిగించారు.