ArticlesNews

సంఘసంస్కరణాభిలాషి, ధార్మిక దార్శనికుడు కావ్యకంఠ గణపతి ముని

150views

( నవంబర్ 17 – కావ్యకంఠ గణపతి ముని జయంతి )

మానవాళిని సన్మార్గంలో పెట్టడానికి, సనాత ధర్మాన్ని సంరక్షించడానికి యుగపురుషులు అవతరిస్తారు. వారి రాకతో పండితులే కాదు పామరులు, సమస్త జీవకోటి తరిస్తారు. అటువంటి వారిలో చెప్పుకోతగినవారు వశిష్ఠ గణపతి ముని లేదా కావ్యకంఠ గణపతి ముని. ఆయన పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త, తపోవేత్త మాత్రమే కాదు కవి, దేశభక్తుడు, సంస్కరణశీలి కూడా!

గణపతి శాస్త్రి విజయనగరం జిల్లాలోని కలవరాయి అగ్రహారంలో అయ్యల సోమయాజుల నరసింహశాస్త్రి, నరసమాంబ దంపతుల రెండవ సంతానంగా 1878 నవంబర్ 17న జన్మించారు. తమ ఇష్ట దేవతల నామములతో దంపతులు ఆ పిల్లవాడికి సూర్య గణపతి శాస్త్రి అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు ఏకసంథాగ్రాహి, ఛందో, వ్యాకరణ, అలంకార శాస్త్రాలలో, కావ్య, ఇతిహాసాలలో నిష్ణాతుడయ్యాడు. బాల రామాయణము, శివ సహస్రము కంఠస్థముగా వచ్చాయి. పదేళ్లకే గణితశాస్త్రములో, పంచాంగ గణములో కూడా ఆశ్చర్యపరచే విద్వత్తు కనబరిచాడు. సిద్ధ జ్యోతిష్యుడని అందరూ అతనిని ప్రశంసించారు. అవధానాలలో కూడా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఆ వయసులోనే ఒక్క గంటలో ముప్పై నాలుగు శ్లోకాలతో ‘‘పాండవ ధార్తరాష్ట్ర సంభవ’’ అన్న ఖండిక రాశారు. 1896 నుండి 1902 వరకు దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అరుణాచలం చేరి భగవాన్ రమణ మహర్షి ప్రియ శిష్యుడిగా పేరు తెచ్చుకున్న అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి కాలక్రమేణ కావ్యకంఠ వాసిష్ట గణపతి మునిగా ప్రసిద్ధి పొందారు.

కావ్యకంఠ గణపతి ముని అనేక గ్రంథాలను రచించారు. “పరీక్ష” అనే పరిశోధన గ్రంథం, సంస్కృతంలో ‘పూర్ణ’ అనే నవల, ‘దశ మహావిద్యలు’, ‘ఉమాసహస్రం’, ‘ఇంద్రాణీ సప్తశతి’, ‘రేణుకా స్తోత్రం’, ‘అంబికా స్తోత్రం’, ‘శ్రీ రమణగీత’, ‘భారత చరిత్ర’, మొదలైనవి రచించారు. “వేదాలు పౌరుషేయాలే! అంటే అతీంద్రీయ ద్రష్ఠలైన మహర్షులు రచించిన గ్రంథాలు వేదాలు!” అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. 1903వ సంవత్సరం చెన్నపట్టణం చేరి కొందరు విద్యార్థులను, యువకులను సమీకరించి కర్మయోగం, వేదకాలపు ఋషి జీవన విధానం, స్త్రీ పురుష వివక్ష మరియు వర్ణ వివక్షలను అంతమొందించటం, ప్రతి ఇల్లు మంత్ర స్పందితం కావడం అనే 4 ఆశయాల ద్వార లోకకళ్యాణం జరుగుతుందని గణపతిశాస్త్రి భావించారు. 1904వ సంవత్సరంలో వేలూరు క్రైస్తవ పాఠశాలలో తెలుగు పండితులుగా పని చేస్తూ కుల వివక్షకు తావు లేకుండా యువకులందరినీ సమీకరించి ‘‘ఇంద్రసంఘం’’ అనే సంస్థను స్థాపించి భారతదేశ స్వాతంత్రాన్ని కోరుతూ ‘‘ఉమాం వందేమాతరం’’ అనే మంత్రాన్ని యువకులకు ఉపదేశించారు గణపతి శాస్త్రి. భారతదేశ వైభవాన్ని కోరుతూ 1922లో ‘‘ఇంద్రాణీ సప్తశతి’’ అనే పుస్తకం రాసి మహిళలు సైతం యజ్ఞోపవీతం, మంత్రోపదేశానికి అర్హులని బహిరంగంగా చాటి చెప్పిన ధైర్యశాలి మన కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని.

అస్పృశ్యతను, దురాచారాలను ఎండగట్టడమే కాకుండా సంస్కృత భాషను జాతీయభాషగా ప్రవేశపెట్టాలని బహిరంగంగా మాట్లాడిన ధీశాలి, మన ఆంధ్రుడు శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని. తమిళనాడులో శర్మదేవీ క్షేత్రంలో దళిత వ్యక్తిని వంటవానిగా పెట్టించడంతో సమాజంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడ్డారు. దళితుల ఉన్నతి కోసం చేసిన కృషికి గౌరవ సూచకంగా 1927 ఫిబ్రవరి 25న హైదరాబాద్‌లోని శ్రీ మందపాటి హనుమంతరావు గారి ఇంటి నుండి చాదర్ ఘాట్ వరకు దళితులచే ఊరేగింపబడి వారిచే ‘‘ముని’’ అనే బిరుదు పొందిన మన ధార్మిక, విద్యారంగ దార్శనికుడు అయిన శ్రీ గణపతి ముని 1936 జూలై 25న సమాధి పొందారు.

అపారమైన పాండిత్యం, దేశ విముక్తి కోసం ఆరాటం, సంఘసంస్కరణాభిలాష, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం తపన… ఇవన్నీ కలగలసిన విశిష్టమైన వ్యక్తి కావ్యకంఠ గణపతి ముని. శ్రీరమణ మహర్షికి సన్నిహిత శిష్యునిగా, బహు గ్రంథకర్తగా ఆయన సుప్రసిద్ధుడు. శ్రీ రమణ మహర్షిని మొదట ఆ పేరుతో పిలిచినవాడు, మౌనాన్ని ఆశ్రయించిన ఆయనతో మాట్లాడించినవాడు, ‘నాయన’గా ప్రసిద్ధి కెక్కినవాడు… శ్రీ కావ్యకంఠ గణపతి ముని. వారి జీవితం అంతా పరోపకారమే. భారతదేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న కారణ జన్ములు శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని జీవితం నేటి యువతకు ఆదర్శం.