ArticlesNews

నాగుల చవితి ఎప్పుడు? శుభముహూర్తం, పూజా విధానం మీ కోసం!

104views

హిందూ సంప్రదాయంలో నాగ పంచమి, నాగుల చవితి వేడుకలు ప్రత్యేకం. నాగదేవతను ఆరాధించే ఈ వేడుకల్లో నాగుల పంచమిని శ్రావణమాసం శుక్లపక్షం పంచమి తిథి రోజు జరుపుకుంటే.. నాగుల చవితి వేడుకలు కార్తికమాసంలో పౌర్ణమి ముందు వచ్చే చవితి రోజున జరుపుకుంటారు. మరి ఈ సంవత్సరం నాగులచవితి ఏ రోజు వచ్చింది..? పూజా విధానం ఏంటి..? వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

పూజా సమయం ఎప్పుడు:

ఈ సంవత్సరం.. ఏ పండగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో “డబుల్ ట్రబుల్” వెంటాడుతోంది. ఈ ఏడాది అధిక మాసం కారణంగా.. ప్రతి పండక్కీ రెండు డేట్లు వస్తుండడంతో.. ఏ రోజు అసలు పండగ జరుపుకోవాలో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఈ మధ్యకాలంలో జరుపుకున్న రాఖీ, వినాయక చవితి, దసరా, దీపావళి విషయంలోనూ అదే కన్ఫ్యూజన్. ఇప్పుడు.. నాగుల చవితి విషయంలోనూ అదే సందిగ్ధత నెలకొంది. ఇంతకీ నాగుల చవితిని ఎప్పుడు జరుపుకోవాలంటే..?

నవంబరు 17 నాగులచవితి:

నాగుల చవితిని కార్తిక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే చవితి తిథి రోజున జరుపుకుంటాం. ఈ ఏడాది చవితి ఘడియలు నవంబరు 16 గురువారం మధ్యాహ్నం 12.54 గంటలకు మొదలై.. నవంబరు 17 శుక్రవారం ఉదయం 11.32 వరకూ ఉంది. రాత్రివేళ చేసే పండుగలు అయితే రాత్రికి తిథి ఉండడం ప్రధానం. మిగిలిన అన్ని పండుగలకు సూర్యోదయానికి తిథి ఉండడమే లెక్కలోకి వస్తుంది. నాగుల చవితి నాడు సూర్యోదయానికి తిథి ప్రధానం కాబట్టి నవంబరు 17 శుక్రవారమే ఈ పండగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

నాగుల చవితి పూజా విధానం:

• నాగుల చవితి రోజున తెల్లవారుజామునే లేవాలి. తలంటు స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.
• పూజా మందిరం, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
• గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు కట్టుకొని పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి.
• పూజకు ఎర్రటి పువ్వులను వాడితే మంచిది.
• చలిమిడిని(బెల్లం, బియ్యపిండితో చేసే వంటకం) చేసి చిన్న చిన్న ఉండలుగా చుట్టాలి.
• అరటి పండ్లు, వడపప్పు వంటి వాటిని నైవేద్యానికి సిద్ధం చేయాలి.
• ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామాలను పఠించాలి.
• తర్వాత ఇంటి దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లాలి.
• పుట్ట దగ్గర పసుపు, కుంకుమతో పూజించి, దీపం పెట్టాలి. తెచ్చిన ఆహారాలను నైవేద్యంగా సమర్పించాలి. పుట్టలో ఆవు పాలను పోయాలి.
• అక్షింతలు చేతిలో పట్టుకుని పుట్ట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ అక్షింతలను పుట్టపై చల్లాలి.
• కొబ్బరి కాయ కొట్టి ఆ నీటిని పుట్టపై చల్లాలి.
• ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేయాలి.
• నాగుల చవితి నాడు ‘ఓం నాగేంద్రస్వామినే నమ:’ అని 108 సార్లు జపించాలి.
• పుట్ట మన్నును తీసి చెవికి పెట్టుకుంటే చెవి బాధలు, కంటి బాధలు తగ్గుతాయని నమ్మకం. సంతానం కోసం ఎదురుచూసే వారు కూడా నాగుల చవితి నాడు పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి.. పుట్టమన్నను తీసి పొట్టకు రాసుకుంటే.. గర్భాశయ సమస్యలు తొలగిపోయి.. పిల్లలు పుడతారని చాలా మంది నమ్ముతారు.

పుట్టలో పాలుపోసే ముహూర్తం:
చవితి ఘడియలు శుక్రవారం ఉదయం 11.32 వరకు ఉన్నాయి.. అంటే ఆ సమయంలో వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయం చూసుకుని.. చవితి ఘడియలు దాటిపోకుండా అంటే పదకొండున్నరలోపు నాగేంద్రుడి పూజ చేయాలి. ఎక్కువ శాతం మంది ప్రజలు తెల్లవారుజామునే పుట్టవద్దకు వెళ్లి పాలు పోస్తారు.

నాగ ప్రతిమ ఆరాధన:
కొన్ని చోట్ల ప్రజలు తమ ఇళ్ల గోడలపై పాముల బొమ్మలు గీసి పూజలు చేస్తారు. అలాగే పుట్టలు అందుబాటులో ఉన్నవారు స్వయంగా పుట్టల దగ్గరకు వెళ్లి పాలు పోసి పూజిస్తారు. అందుబాటులో లేనివారు నాగప్రతిమలను ఆరాధించవచ్చు. ఈ రోజు నాగదేవతతో పాటు శివుడిని పూజించడం వల్ల ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు ఉండదని ఒక నమ్మకం.

నాగుల చవితి రోజున కింద ఇచ్చిన శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి..
కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ!
ఋతుపర్ణస్య రాజ కీర్తనం కలినాశనమ్