ArticlesNews

ధన్వంతరి ఎవరు? తనను ధన త్రయోదశి రోజునే ఎందుకు పూజిస్తారో తెలుసా!

49views

( ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి – ధన్వంతరి జయంతి )

వైద్యుడి హస్తవాసి బాగుంటే అతను ధన్వంతరి అంతటివాడంటాం. అలాంటి ధన్వంతరిని కృతజ్ఞాపూర్వకంగా తల్చుకునేందుకు మన పెద్దలు ఒక పండుగను కూడా నియమించారు. అదే ధన్వంతరి జయంతి. సకల ఆయురారోగ్యాలు ప్రసాదించే వైద్య నారాయణుడు ధన్వంతరి ప్రామాణిక గ్రంథాలలో `ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి`ని ధన్వంతరి జయంతిగా పేర్కొన్నారు. ఆ సందర్భంగా ధన్వంతరి గురించి కొన్ని విషయాలు

పురాణాల ప్రకారం, దేవతలు, రాక్షసులు సాగర మథనం చేస్తున్నప్పుడు త్రయోదశి రోజున విష్ణువు ధన్వంతరి అవతారంలో అమృత కలశాన్ని పట్టుకుని కనిపించాడు. అదే రోజున ధన్వంతరి పుట్టినరోజుగా భావిస్తారు. అప్పటినుంచి ప్రతి ఏటా ధన్వంతరి జయంతి సందర్భంగా తనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆయుర్వేద వైద్యులు ప్రతియేటా “ధన త్రయోదశి” (దీపావళికి రెండు రోజుల ముందు) నాడు భక్తితో జరుపుకొంటారు.

ఆయుర్వేద పితామహుడు
ధన్వంతరిని వైద్యో నారాయణ హరి అని కూడా అంటారు. ధన్వంతరి తన నాలుగు చేతుల్లో అన్ని జీవుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటాడు. అందుకే తనను ఆయుర్వేద పితామహుడిగా పరిగణిస్తారు. ధన్వంతరి భగవానుడు సుశ్రుతాచార్యకు శస్త్రచికిత్స జ్ఞానాన్ని అందించాడు. సుశ్రుతాచార్యను శస్త్రచికిత్స పితామహుడిగా భావిస్తారు. ధన్వంతరి నుండి చరకచార్య ఆయుర్వేద జ్ఞానాన్ని విస్తరించాడు. ఇప్పటికీ మన దేశంలో ఆయుర్వేద సంప్రదాయం చెక్కు చెదరకుండా ఉందంటే.. దాని ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

శరీరాన్ని అంతుచిక్కిన వ్యాధి పీడిస్తున్నప్పుడూ, దీర్ఘకాలిక రోగాలు పట్టివిడవనప్పుడూ ధన్వంతరిని పూజిస్తే ఉపశమనం లభిస్తుందంటారు పెద్దలు. ఒకవేళ ధన్వంతరి చిత్రపటం ఏదీ లేకపోతే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి ప్రతిమనే ధన్వంతరిగా భావించవచ్చు. ధన్వంతరికి ప్రత్యేకించిన మంత్రాలు చాలానే వినిపిస్తాయి. వాటిలో ఒకటి…

`ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశ హస్తాయ
సర్వామయ వినాశనాయ
త్రైలోక్య నాథాయ శ్రీ మహావిష్ణవే నమః`
(అమృత కలశాన్ని చేత ధరించి, సర్వరోగాలనూ పారద్రోలే ఆ విష్ణుస్వరూపుడైన ధన్వంతరికి వందనం!)


ధన త్రయోదశి రోజున బంగారం, వెండి లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే విషయంలో మనలో చాలా మందికి తెలుసు. ఎందుకంటే ధన్వంతరికి, కుభేరుడికి ఈరోజు చాలా ఇష్టమైన రోజు. అందుకే వీరిద్దరికీ ధంతేరాస్ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల తమ సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి తమ ఇంట్లో నివాసం ఉంటుందని చాలా మంది నమ్ముతారు.

బహుశా ధన్వంతరిని విష్ణుమూర్తి అంశగా భావించడం వల్లనేమో ఆయనకు ప్రత్యేకించిన ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. ఔషధ వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే కేరళలో ధన్వంతరికి ప్రత్యేకించిన పురాతన ఆలయాలు కొన్ని ఉన్నాయి. అలాగే తమిళనాడులోని శ్రీరంగనాధస్వామి ఆలయంలో, ధన్వంతరికి కూడా ఒక ఆలయం ఉంది. రామానుజాచార్యులవారికి ముందు నుంచే ఈ ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. రామానుజాచార్యులవారు, రంగనాధస్వామి నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు, ఇక్కడి నుంచి మూలికల కషాయాన్ని మూలవిరాట్టు దగ్గరకు పంపే ఆచారాన్ని మొదలుపెట్టారట. ఆంధ్రప్రదేశ్‌లోని చింతలూరులో కూడా ఒక ధన్వంతరి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు.

2016 నుంచి భారత ప్రభుత్వం ధన్వంతరి జయంతిని ‘‘జాతీయ ఆయుర్వేద దినోత్సవం’’గా ప్రకటించింది.