
శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి ఆలయంలో ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాతగా భక్తులు భావించే శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలోనీ మూల విరాట్ ని అక్టోబర్ 1, 2 తేదీల్లోసూర్య కిరణాలు స్వామివారిని తాకనున్నాయి. సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనం, దక్షిణాయనం నుండి ఉత్తరాయణం లోకి పయనించే క్రమంలో ప్రతి ఏటా రెండు సార్లు ఈ అపురూప ఘట్టం చోటుచేసుకుంటుంది. అది ఉత్తరాయణంలో అయితే మార్చి 8, 9 తేదీలలో, దక్షిణాయనంలో అయితే అక్టోబర్ 1,2 తేదీలలో రెండు రోజులు మాత్రమే దేవాలయం గర్భ గుడిలో ఉన్న స్వామి వారి విగ్రహాన్ని సూర్యుని లేలేత కిరణాలు తాకుతాయి.
ఆలయ ప్రాకారాన్ని దాటి సుమారు 400 అడుగుల దూరంలో ఉన్న మూల విరాట్ ని తాకే సూర్య కిరణాలు
అరసవిల్లి దేవాలయంలోని మూల విరాట్ ని సూర్యకిరణాలు తాకటం ఓ అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఆలయ ప్రాకారం నుండి మూడు విరాట్ కు సుమారు 400 అడుగుల దూరం ఉంటుంది. ఆలయ ప్రాకారాలను, మండపాన్ని , ద్వజ స్తంభాన్ని దాటుకొని సూర్య కిరణాలు స్వామి వారి విగ్రహంపై పడతాయి.
ఈ దృశ్యాన్ని చూసిన భక్తులకు ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధించి వారు ఆనందంగా ఉంటారనేది భక్తుల నమ్మకం. అందుకనే ఈ సుందర ఘట్టాన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అరసవల్లికి తరలివస్తారు. ఈ ఏడాది మార్చి 8న సూర్యకిరణాలు మూల విరాట్ ని తాకి కనువిందు చేయగా రెండో రోజైనా మార్చి తొమ్మిదవ తేదీన మబ్బులు అడ్డు రావడంతో సూర్య కిరణాలు ముఖం చాటేసాయి. ఈసారి అక్టోబర్ 1, 2 తేదీల్లో మళ్ళీ ఆ అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. అందుకు తగ్గట్టుగానే ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.