
మంగళవారం తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.
శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, తామరలతో వేదికను సుందరంగా తీర్చిదిద్దారు.
ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల పెద్ద జీయ్యంగార్, తిరుమల చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఏలకులు, వట్టి వేరు, పిస్తా, చందనం, నల్ల ద్రాక్ష, పసుపు కొమ్ములు, రోజ్ పెటల్స్. తులసి దండలు స్వామి అమ్మవార్లకు అలంకరించారు.
టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేశారు. ఒక్క టన్ను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, పండ్లు, లతలతో వేదికను శోభాయమానంగా అలంకరించడమే కాకుండా శ్రీ మలయప్ప స్వామివారికి రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుపూర్, సేలం దాతలు ఈ మాలలను విరాళంగా అందించారు.