Articles

అక్షరాలే ఆయుధంగా జీవించిన అమర సాహితీవేత్త బోయి భీమన్న

69views

(సెప్టెంబ‌ర్ 19 – బోయి భీమన్న జయంతి)

ఆధునిక తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప కవి. బోయి భీమన్న పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, వచన కవిత వంటి పలు సాహితీ ప్రక్రియల్లో 70 కి పైగా రచనలు చేసిన బోయి భీమన్న 1911 సెప్టెంబర్ 19 వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో పుల్లయ్య, నాగమ్మ దంపతులకు జన్మించారు. పేదరికం, అంటరానితనం, అవమానాల స్వానుభవాలతో అక్షరాలే ఆయుధంగా అనుక్షణం ఉద్యమించిన ఈ సాహితీవేత్త. “భరత జాతి ఏకత్వం “, సమాజంలో చెడ్డ వాళ్ళే కాదు… మంచి వాళ్ళూ ఉంటారన్న అంశాలను తన రచనలలో ప్రతిబింప చేశారు. భారత రత్న పురస్కార గ్రహీత, రాజ్యాంగాన్ని రచించిన మహా మేధావి డాక్టర్ అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచారు. అంబేద్కర్ రాసిన ” ఎన్హిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్ “అన్న గ్రంధాన్ని “” కుల నిర్మూలన “” పేరుతో తెలుగులోకి అనువదించారు. అంతే త్రికరణ శుద్ధితో అంబే ద్కర్ సిద్ధాంత వాదాన్ని బోయి భీమన్న అనుసరించి ప్రచారం చేశారు. అంతే కాదు అంబేద్కర్, భీమన్న….ఇరువురూ చదువుకోవడం వల్లనే సమాజానికి ఆదర్శం కాగలిగారు. యాదృచ్ఛికంగా వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకోవడం గమనార్హం.

విద్యాభ్యాసం పూర్తి అయిన తొలి రోజుల్లో భీమన్న ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఆ తరువాత జనవాణి, జయభేరి, ప్రజామిత్ర, నవజీవన్ , ఆంధ్ర ప్రభ పత్రికలలో పని చేశారు.” వ్యక్తుల వికాసమే జాతి, జాతుల వికాసమే వసుధ, వసుదైక సామ్రాజ్యమే మానవ లోక సంపూర్ణ ఫలం” అన్నది భీమన్న తాత్విక భూమిక. కవి ఏ కాలంలో జీవించాడో ఆ కాలానికి సంబంధించిన సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విషయాలన్నీ అతడి రచనల్లో ప్రతిబింబించాలి” అని చెప్పిన బోయి భీమన్న కవిత్వం తెలుగు సంస్కృతికి అద్దం పడుతోంది.

సాహిత్యంలో భీమన్న సృష్టించిన ఒరవడి అద్వితీయం, అజరామరం. హ రిజనులుగా సమాజంచే పిలువబడిన వారి అంతరంగాలలో స్వాభిమానాన్ని నింపి సమకాలీన సమాజంతో వారు గౌరవానికి అర్హులయ్యేట్టు చేయడం బోయి భీమన్న సాహిత్య లక్ష్యం. సంస్కరణ, జాతీయ వాద దృష్టి కలగలసిన అద్భుత సమరసతా కవితా మూర్తి భీమన్న అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. సమాజంలో సంఘర్షణలకు కారణమైన కుల, మత, వర్గ విభేదాలను అధిగమించాలంటే అందరూ విద్యావంతులు కావాలన్నది ఆయన సమాజానికి ఇచ్చిన సందేశం. ” సామాజిక సమరసత, సాహితీ సమర్చన” అన్న అంశాలను రెండు కళ్లుగా చేసుకుని భీమన్న జీవించారు. కులం లేని జాతి ఆవిర్భావం కోసం కలలు కన్నారు. కుల మతాల కంటే మానవతకు ప్రాధాన్య మిచ్చారు.

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత గా పేరుగాంచిన బోయి భీమన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారంతో పాటు పలు సన్మానాలందుకున్నారు. ఆయన రచించిన “గుడిసెలు కాలిపోతున్నాయి” అన్న గ్రంధానికి 1975 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వారు 1971 సంవత్సరంలో కళా ప్రపూర్ణ బిరుదును ప్రదానం చేశారు. తెలుగు సాహితీ రంగానికి ఆ మహనీయుడు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1973 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం, 2001 సంవత్సరంలో పద్మ భూషణ్ పురస్కారం తో సత్కరించింది. 1976 సంవత్సరంలో కాశీ విద్యా పీఠం, ఆ తరువాత నాగార్జున విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ లను ప్రదానం చేశాయి. 1991 సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో విశిష్ట పురస్కారం, 2004 సంవత్సరంలో తంగిరాల కృష్ణ ప్రసాద్ స్మారక పురస్కారం అందుకోవడం బోయి భీమన్న ప్రతిభకు నిదర్శనం. బోయి భీమన్నను ప్రతిభాశాలిగా నిలబెట్టిన ఆయన రచనలలో బోయి భీమన్న రచనలలో దీప సభ కావ్యం, పాలేరు, కూలి రాజు, రాగం వాశీష్టం, బాల యోగి అన్న నాటకాలు, పైరు పాట, మానవుని మరొక మజిలీ గేయ నాటికలు, జానపదుని జాబులు, పిల్లి శతకం మొదలైన రచనలు ప్రముఖ మైనవి. 2005 వ సంవత్సరం డిసెంబర్ 16 వ తేదీన కన్ను మూసిన బోయి భీమన్న తెలుగు పత్రికా రంగానికి పాత్రికేయునిగా చేసిన సేవలు చిరస్మరణీయం.

బోయి భీమన్న తన రచనలలో కుల మతాల కంటే మానవతకు ప్రాధాన్య మిచ్చారు. భీమన్న చూపిన సమరసతా మార్గం మనకు ఎంతైనా అనుసరణీయం. సమరసత ఒక ఆచరణాత్మక అంశం. ఇది హృదయానికి సంబంధించిన భావావేశం. వ్యక్తి వ్యష్టి నుండి సమిష్టి పరమేష్టి వైపు కొనసాగే ఒక హృదయ పరివర్తన సమరసత. హృదయ విశాలత అలవడితే సమరసత సాధ్య మవుతుంది. ఆ దిశలో అడుగులు వేద్దాం. బోయి భీమన్న ఆశయాలను సాధిద్దాం. విశ్వ మానవతకు పెద్ద పీట వేద్దాం.