
దేశవ్యాప్తంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలున్న వారిని గుర్తించేందుకు పరీక్షలను పెంచాలని, ల్యాబ్ సౌకర్యాలను విస్తరించాలని అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్ కేసులను గుర్తించి పాజిటివ్ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనివల్ల కొత్త వేరియంట్లను త్వరగా గుర్తించగలుగుతామని స్పష్టం చేశారు. గత రెండు వారాలుగా ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం దిల్లీలో ఆయన సమీక్ష జరిపారు. కేసులను ఎదుర్కొనే సన్నద్ధత, ఆసుపత్రుల్లోని సౌకర్యాలు, ఔషధాల రవాణా, టీకాల తీరు, కొవిడ్ వేరియంట్లతో అత్యవసర పరిస్థితి తలెత్తితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, దేశంపై పడే ప్రభావం వంటి వాటిని సమీక్షించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ఆసుపత్రుల్లో రోగులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని, వృద్ధులు, రద్దీ ప్రాంతాల్లో తిరిగేవారు మాస్కులను ధరించేలా ప్రోత్సహించాలని సమీక్షలో ప్రధాని పేర్కొన్నారు. సమీక్ష సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశంలో రోజుకు సగటున 888 కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని, 20 ప్రధాన కొవిడ్ ఔషధాలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహించామని వివరించారు. 2020లో దేశంలో కరోనా కేసులు వెలుగు చూసినప్పుడు మార్చి 22నే ప్రధాని జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. సరిగ్గా మళ్లీ అదే రోజున బుధవారం (2023 మార్చి 22) ప్రధాని వైరస్‌ల విస్తృతిపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడం గమనార్హం.