
కోదండరాముడి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ, ఎస్పీ అన్బురాజన్, జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కోదండరాముడి కళ్యాణ వేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి ఏప్రిల్ 5న జరిగే సీతారాముల కల్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఈవో అధికారులకు సూచించారు. ఈనెల 31 నాటికి పనులను పూర్తి చేయాలని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టాలని అధికారలను ఆదేశించారు. కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 5న జరిగే సీతారాములవారి కల్యాణానికి ముఖ్యమంత్రి జగన్ వచ్చే అవకాశం ఉన్నందున పెద్దసంఖ్యలో భక్తులతో పాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లను చేయాలన్నారు. కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఈనెల 31న ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.