News

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు

97views

తిరుమలలో ఉగాది ఆస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కన్నులపండువగా నిర్వహించడానికి ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోన్నారు. దీన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. సంవత్సరంలో నాలుగుసార్లు- ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఆ రోజున ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి.. తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు.
శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా సంప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

ఉగాది ఆస్థానం నాడు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాతాన్ని నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణాన్ని ఏర్పాటు చేస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు..

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ అధికారులు రద్దు చేశారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం సందర్భంగా 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలను రద్దు చేసినట్లు ఇదివరకే వెల్లడించారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫారసు లేఖలను కూడా స్వీకరించమని అధికారులు స్పష్టం చేశారు.