News

నిమజ్జనంతో ముగిసిన గంగమ్మ జాతర

7views

చిత్తూరు జిల్లా పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర నిమజ్జనంతో ముగిసింది. మంగళవారం రాత్రి జమిందారుల తొలిపూజతో గంగ జాతర ప్రారంభమైంది. అనంతరం అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి.. బుధవారం వేకువజామున ప్యాలెస్‌ ఆవరణలోని ఆలయంలో ప్రతిష్ఠించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. గురువారం తెల్లవారుజామున గంగమ్మను నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపులో బజారువీధిలోని నడివీధి గంగమ్మ, మైసూర్‌బ్యాంకు వద్ద కొలువుదీరిన మల్లారమ్మ కలిశారు. సుబేదార్‌వీధి, తేరువీధి మీదుగా తూర్పుమొగసాలలోని చౌడేశ్వరిదేవి ఆలయం వరకు అట్టహాసంగా ఊరేగింపు సాగింది. చాముండేశ్వరిదేవి ఆలయానికి మల్లారమ్మ వెళ్లి అమ్మవారిని పలకరించి వెనుదిరిగారు. అమ్మవారికి ఎనుపోతును బలిఇచ్చి తోటి కులస్తులు ఆ ఎనుపోతు తలను చేటలో పెట్టుకుని తీసుకెళ్లారు. సుగుటూరు గంగమ్మ, నడివీధి గంగమ్మలు చాముండేశ్వరి గుడి ఎదురుగా ఉన్న కోనేరు వద్ద గంగమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని గూడూరుపల్లె పూజారులు పూర్తి చేశారు. నిమజ్జనం ముగియగానే సుగుటూరు గంగమ్మ విగ్రహాన్ని ఎవరికీ కనిపించనీయకుండా వస్ర్తాలతో చుట్టి ప్యాలె్‌సకు తీసుకొచ్చి భద్రపరిచారు. ప్యాలె్‌సలో పూజారులు అమ్మవారికి అలంకరించిన అభరణాలను జమించాదులకు అందించి పూజలు చేశారు. జమిందారుల మలిపూజతో సుగుటూరు గంగమ్మ ప్యాలెస్‌ గృహనిర్బంధంలోకి వెళ్లడంతో రెండు రోజులుగా జరిగిన జాతర గురువారం ఉదయంతో ముగిసింది.