
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో కొండమీదరాయుడు బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఈ సందర్బంగా స్వామి గరుత్మంతుడిపై భక్తులకు దర్శనమిచ్చారు. గరుడవాహన సేవకు ముందు ఉదయం స్థానిక కొండమీదరాయుడు స్వామి దేవాలయంలో ఉత్సవమూర్తులకు గరుడాద్రి బ్రాహ్మణ సంఘం వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీనారాయణస్వామి దేవాలయం నుంచి స్వామి వారి ఊరేగింపు మంగళవాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. గరుడ వాహనంపై ఊరేగిన కొండమీదరాయుడు స్వామిని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా శనివారం గజవాహనం సేవ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
గరుడ వాహనంపై రంగనాథుడు…
తొండపాడు బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేతుడైన రంగనాథుడు శుక్రవారం గరుడవాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఆలయంలో స్వామివారికి వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. చిన్న రథంపై స్వామి, అమ్మవార్లను భక్తులు జమ్మిచెట్టు వరకు లాగారు.