NewsProgramms

2024 నాటికి దేశంలో 10వేల జన్‌ ఔషధి కేంద్రాలు!

374views

ఔషధాలను తక్కువ ధరలకు ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన జన్‌ ఔషధి మందుల దుకాణాల సంఖ్యను 2024 నాటికి 10 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 766 జిల్లాలకు గాను 743 జిల్లా కేంద్రాల్లో 9 వేల జన్‌ ఔషధి లేదా జనరిక్‌ పేరుతో మందుల షాపులు విస్తరించాయి. అయితే ఈ షాపుల వల్ల గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో 19 వేల కోట్ల రూపాయల వరకు ప్రజల సొమ్ము ఆదా అయ్యిందని కేంద్రం తెలిపింది. మరిన్ని ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీటి సంఖ్యను పది వేలకు పెంచాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మా స్యూటికల్స్‌ విభాగం 2008 నవంబర్‌లో జన్‌ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. 2017 నాటికి మూడు వేల షాపులు ఏర్పాటు చేశారు. 2020 మార్చి నాటికి ఈ సంఖ్య రెట్టింపయ్యింది. ప్రస్తుతం 9 వేలకు చేరింది. జన ఔషధి జనరిక్‌ మందుల షాపుల్లో బ్రాండెడ్‌ ఔషధాలతో పోల్చితే 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే లభిస్తాయి. మొత్తం 1759 ఔషధాలు, 280 సర్జికల్‌ పరికరాలు ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం ఈ కేంద్రాల ద్వారా 758.69 కోట్ల విక్రయాలు జరిగాయి. జన్‌ ఔషధి కేంద్రాల ద్వారా యువతకు స్వయం ఉపాధి సైతం లభిస్తోంది. ఒక్కో కేంద్రానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తోంది. ప్రజల్లో జనరిక్‌ ఔషధాల పట్ల క్రమంగా ఆధారణ పెరుగుతోంది. అందువల్లే ప్రభుత్వం వీటిపై అవగాహన కల్పించేందుకు ప్రచారం కూడా నిర్వహిస్తోంది.

నిరుద్యోగులకు ఇది వరం..

కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి యోజన సెంటర్ల ద్వారా తక్కువ ధరకే మందులు (మెడిషన్స్) అందిస్తోంది. దేశంలోని ప్రతి జిల్లాల్లో ఇలాంటి స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఇంటి వద్ద నుంచి డబ్బు సంపాదించే అవకాశాన్ని నిరుద్యోగులు, యువత పొందవచ్చు. జన్ ఔషధి కేంద్రాల్లో మెడిసన్స్‌ను 90 శాతం తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. జన్ ఔషధి కేంద్రం ఏర్పాటుకే కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షలు అందిస్తోంది. దీంతో స్టోర్‌ను తెరవొచ్చు. ఈ స్టోర్లను ఎవరైనా ప్రారంభించొచ్చు. ఫార్మసిస్ట్‌లు, డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటల్స్, స్వయం సహాయక గ్రూపులు, ఎన్‌జీఓలు, ట్రస్ట్‌లు ఇలా ఎవరైనా ఈ మెడికల్ స్టోర్లను తెరవచ్చు. ఇందులో 900 రకాల మెడిసన్స్ అందుబాటులో ఉంటాయి. 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ షాపులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే జన్ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే లైసెన్స్ ఉండాలి. దీని కోసం అప్లై చేసుకోవాలి. http://janaushadhi.gov.in/ ఈ వెబ్‌సైట్‌లోకి వెల్లి ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, అప్లికేషన్ ఫిల్ చేసి, జనరల్ మేనేజర్ (ఏఅండ్ఎఫ్) ఆఫ్ బ్యూరో ఆఫ్ ఫార్మా పబ్లిక్ సెక్టార్ అండర్‌టెకింగ్ ఆఫ్ ఇండియాకు దీన్ని పంపించాలి. వెబ్‌సైట్‌లోనే అడ్రస్ ఉంటుంది. స్టోర్ల ద్వారా ఒక నెలలో విక్రయించే మెడిసన్స్ ధరలో 20 శాతాన్ని కమిషన్‌గా పొందొచ్చు. అలాగే ప్రతి నెల అమ్మకాలపై 15 శాతం ఇన్సెటివ్ కూడా పొందొచ్చు. అంటే లక్ష రూపాయలు విలువచేసే మెడిసన్స్ విక్రయిస్తే.. మీకు రూ.30 వేలు వరకు వస్తాయి. దీంతో జన్ ఔషధి కేంద్రం ద్వారా మంచి రాబడి వస్తుందని చెప్పవచ్చు.