
దేశ రాజధాని దిల్లీలో సంచలనం సృష్టించిన అంజలి అనే యువతి మృతి కేసుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించి తనకు నిజనిర్థారణ నివేదికను సాధ్యమైనంత త్వరగా అందించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను ఆదేశించారు.
జనవరి 1వ తేదీ తెల్లవారుజామున స్కూటీని ఓ కారు ఢీకొన్న ఘటనలో దాదాపు 12 నుంచి 13 కిలోమీటర్ల వరకు స్కూటీపై ఉన్న 20 సంవత్సరాల అంజలి సింగ్ అనే యువతిని ఈడ్చుకెళ్లడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పలు అనుమానాలు తలెత్తాయి. అయితే దీనిపై కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కేసు నమోదు చేయడంతో దిల్లీలో నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. దీంతో స్పందించిన అమిత్‌షా సిపి షాలీని సింగ్ సారధ్యంలో ఓ బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. ఇప్పటికే నిందితులు దీపక్ ఖన్నా (26), అమిత్ ఖన్నా (25), కృష్ణన్ (27), మిథున్ (26), మనోజ్ మిత్తల్ (27)గా గుర్తించి.. వారిపై ఐపీసీ సెక్షన్ 279(ర్యాష్ డ్రైవింగ్), 304-ఏ (నిర్లక్షపూరిత ధోరణితో మరణానికి కారకులు కావడం) కింద కేసులు నమోదు చేసి పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వారిని మూడురోజులపాటు కస్టడీకి అప్పగించింది.
అమానవీయ ఘటనతో దిగ్భ్రాంతి..
మృతురాలి పేరు అంజలి (23) ఆమె శుభకార్యాలు చేసే ఈవెంట్ సంస్థలో పనిచేస్తున్నారు. ఈక్రమంలో తన విధులను పూర్తి చేసుకుని తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. వెనుకవైపు నుంచి వచ్చిన ఓ కారు బండిని ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. ప్రమాదం జరగ్గానే కారు దిగి.. ఆమెకు ఏమైందో చూడాల్సింది పోయి.. వారు అక్కడేం జరగనట్టు ముందుకు దూసుకెళ్లిపోయారు.. తీరా ఆ యువతి కారు వెనుకభాగంలో ఇరుక్కుపోయింది. అయినా కారులోని వారు అవేమీ పట్టించుకోకుండా సుమారు 12 కిలోమీటర్ల వరకు వేగంగా తమ వాహనాన్ని నడిపించేశారు. తీవ్రగాయాలపాలైన అంజలి నరకయాతన అనుభవిస్తూ మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచి ఉంటుందని అక్కడి వారు చెబుతున్నారు. యువతి మృతదేహాన్ని దీపక్ దహియా అనే వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం అందించారు. రోడ్డుపై దుస్తులు లేకుండా, తీవ్రగాయాలతో పడి ఉన్న ఆ యువతిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు ఆమెను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.