
60views
పుదుచ్చేరి: ఆలయానికి చెందిన ఓ ఏనుగు గుండెపోటుతో మృతిచెందిన ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. ప్రముఖ మనాకుల వినాయక ఆలయానికి చెందిన ఓ ఏనుగు బుధవారం మృతి చెందింది. సాధారణ నడక కోసం బయటకు తీసుకెళ్ళిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకున్నట్టు ఆలయ సిబ్బంది వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని ఏనుగు పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆలయానికి చేరుకొని నివాళులు అర్పించారు. ఆలయానికి ఎప్పుడు వచ్చినా.. ‘లక్ష్మీ’ ఆశీర్వాదాలు ఇచ్చేదంటూ మునుపటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘లక్ష్మీ’ అనే ఈ ఏనుగును 1995లో వినాయక ఆలయానికి ఓ వ్యాపారవేత్త విరాళంగా అందజేశారు. అప్పటి నుంచి అక్కడికి వచ్చే భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తూ ఎంతో ఆదరణ పొందింది.
Source: Eenadu