News

1000 ఏళ్ళ కిందట ప్రపంచ వ్యాపారంలో భారతదేశమే గొప్పది

344views
  • కర్నూలు సద్భావన సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత సహ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ శ్రీనివాస రెడ్డి

కర్నూలు: 1000 ఏళ్ళ కిందట ప్రపంచ వ్యాపారంలో భారతదేశం వాటా 39%.. నేడు అది 5 లేదా 6% కు తగ్గిందని, అలాగే ఒకప్పుడు ఈ దేశంలో 180000 గురుకులాల వంటి పాఠశాలలు వుండి ప్రపంచ దేశాల నుంచి కూడా విద్య కొరకు విద్యార్థులను రప్పించుకునే పరిస్థితి ఉండేదని.. నేడు విద్యను వ్యాపారంగా మార్చుకునే స్థితి ఏర్పడిందని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రాంత సహ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ మాలపాటి శ్రీనివాస రెడ్డి అన్నారు. స్థానిక శ్రీ కేశవ మెమోరియల్ స్కూలు బుధవార్ పేటలో ఆదివారం సద్భావన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు.

పూర్వం వృత్తులుండేవి, కులాలు కావు, కాలక్రమేణా వృత్తులు కులాలుగా మారాయి, ఏ వృత్తికి ఉండాల్సిన గౌరవం సమాజంలో ఇవ్వబడుతూ వచ్చింది. అంతేకానీ కులాల పేరుతో హెచ్చుతగ్గులు కనబడేవి కావు, సమాజం దృఢంగా వుండాలంటే అన్ని కులాల మధ్య సయోధ్య అవసరం అని అందరూ గ్రహించాలని కోరారు. అందుకే కులమే ఒక విధంగా బలము, మరో విధంగా కులమే బలహీనత. మెగస్తనీసు “ఇండికా” లో భారత దేశాన్ని ఈ విధంగా గమనించి వర్ణించారు దొంగతనాలు లేని, ఆకలి ఎరుగని, సమృద్ధత నిండిన సంపన్న దేశమని… పూర్వం మన రాష్ట్రంలో బందరు రేవులో 400 ఓడలు సరుకులను ప్రపంచ దేశాలకు పంపడానికి సిద్ధం ఉండేవి శ్రీనివాస రెడ్డి చెప్పారు.
సమాజాన్ని సంస్కరింపబడడానికే వేదాలు. పురాణాలు ఉన్నాయని.. చిన్న చిన్న లోపాలను పక్కన పెట్టి భారతమాత బిడ్డలమని భావిస్తేనే జగద్గురుగా భారత్ తిరిగి తలెత్తుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 75 లక్షల చదరపు భూమి నేడు 40 లక్షల చదరపు కిలోమీటర్ల భూమైందని.. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లా, బర్మా, భూటాన్‌లుగా విడిపోయిందని గుర్తు చేశారు.

వేయ్యేళ్ళ క్రితం ఇస్లాం లేదు, 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవం లేదని… హిందూ శరీరంలో రక్తాన్ని మార్చి పూర్వీకుల రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భగవంతుడే ఎన్నో అవతారాలు ఎత్తాడని… ఎంతో వైవిధ్యం కనబరుస్తున్నాడని.. అటువంటిది సమాజంలో వైవిధ్యం, కులాల, వృత్తులుంటే తప్పు లేదని… కానీ ఐక్యత ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఒక్క భారత సంస్కృతి తప్ప ప్రపంచ సంస్కృతులు నాశనమయ్యాయని.. శాంతి, ప్రపంచ శ్రేయస్సును కాంక్షించే దేశం కాబట్టి భారతదేశ మొక్కటే ఇంతవరకు విదేశాలపై దండయాత్ర చేయలేదన్నారు.

స్వామి వివేకానందుడు చెప్పినట్టు భారత్ మేల్కొని… ప్రపంచాన్ని మేల్కొలపాలని… అందుకే మన సమాజంలోని లోపాలను సరిచేసుకుని, హిందూ సమాజాన్ని పటిష్ఠంగా చేసుకుని ముందుకు సాగాలని శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. గోశాలలో గోవులు, వృద్ధులు ఇళ్ళల్లో ఉండాలని.. కుటుంబంలోనే సంస్కృతీ సంప్రదాయాలను పిల్లలకు నేర్పించాలని కోరారు. హిందుత్వం నశిస్తే ప్రపంచం నశిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా హిందూ కుల సంఘాల పెద్దలు, ప్రముఖులు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను, చేస్తున్న వివిధ సేవాకార్యక్రమాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ నగర సంఘచాలక్ సూరా వెంకట రెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లా సంపర్క్ ప్రముఖ్ పరుశురాం రామకృష్ణ, కర్నూల్ నగర సంపర్క ప్రముఖ వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి