
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలందరికీ 2047 కల్లా బీమా భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) సంకల్పించింది. ఇందుకోసం వినూత్న సంస్కరణలు ప్రతిపాదిస్తూ, ఒక విధాన పత్రాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఐఆర్‌డీఏఐ 120వ బోర్డు సమావేశంలో ఆవిష్కరించింది. బీమా కంపెనీలు, వినియోగదార్లు, పంపిణీదార్ల అవసరాలను గుర్తించి, పరిష్కరించడం.. బీమా రంగాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన అంశంగా ఐఆర్‌డీఏఐ గుర్తించింది. ‘వినియోగదార్ల అవసరాలకు అనువైన పాలసీలను బీమా కంపెనీలు ఆవిష్కరించాలి. ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అనువైన వ్యవస్థ ఉండాలి. బీమా కంపెనీలు సులువుగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితులు కల్పించాలి. మార్కెట్ అవసరాల ప్రకారం బీమా నియంత్రణ వ్యవహారాలు ఉండాలి. బీమా రంగంలో కొత్తదనానికి, ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాల’ని నిర్ణయించింది.