News

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర కీలకం

207views

నెల్లూరు: ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్య నాలుగో స్తంభంగా అభివృద్ధి కార్యక్రమాల అనుసంధానకర్తలుగా పాత్రికేయులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్యర్వంలోని పత్రికా సమాచార కార్యాలయం నెల్లూరులో నిర్వహించిన వార్తాలాప్ (పాత్రికేయుల వర్క్ షాప్)లో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమం కోసమే అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతుందని స్పష్టం చేశారు.

ప్రజలకు మేలు చేసే ఉద్ధేశమే అందులో ఉంటుందని, క్షేత్ర స్థాయిలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పాత్రికేయుల చొరవతో వాటిని సరిదిద్దవచ్చని సూచించారు. పాత్రికేయులు, పోలీసులు, రాజకీయనాయకులకు పండుగలు, సెలవులు ఉండవని, సమాజం కోసం ఎవరి స్థాయిలో వారు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తూ ఉంటారని కొనియాడారు.

వైద్యులు ఆరోగ్య సంరక్షణ, ఉపాధ్యాయులు విద్యాబోధన.. ఇలా ఒక్కొక్కరు తమ తమ బాధ్యతలు నిర్వహిస్తున్నా… పాత్రికేయులు మాత్రం సమాజాన్ని జాగృతం చేయటంతో పాటు, ప్రజలు – ప్రభుత్వం మధ్య వారధిగా విలక్షణమైన బాధ్యతను నెత్తిన వేసుకుని పని చేస్తారని తెలిపారు.

ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, వాటి ద్వారా ప్రజలు ఎలా లబ్ధి పొందాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరం, ఎవరు అర్హులు, లబ్ధి పొందలేని వారికి ఇతర పథకాలు ఉన్నాయా లాంటి విషయాలను తెలియజేసేందుకు పాత్రికేయులు చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. విమర్శించడం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమన్న ఆయన, తెలుసుకుని విమర్శించాలి, మంచి కార్యక్రమాలను అభినందించాలని సూచించారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమ విజయంలో ప్రజలు, పాత్రికేయులు పోషించిన పాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి, అందరూ కలిసి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. రాజకీయలు, పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందేందుకు ప్రతి ఒక్కరి చొరవ అవసరమని పేర్కొన్నారు. ఈ దిశగా అభివృద్ధిని ప్రోత్సహించే పాత్రికేయానికి పెద్ద పీట వేయాలని సూచించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి