News

భారతదేశ వృద్ధి అద్భుతం… మోదీ దేశభక్తుడు.. పుతిన్ ప్రశంస

183views

మాస్కో: బ్రిటన్‌కు వలస రాజ్యంగా ఉన్న భారత దేశం ఆధునిక కాలంలో స్వతంత్ర దేశంగా ఉంటూ అభివృద్ధి చెందుతుండటం గురించి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రస్తావిస్తూ భారత దేశ వృద్ధి అద్భుతమని కొనియాడారు. 150 కోట్ల మంది ప్రజలు, స్పష్టమైన అభివృద్ధి ఫలాలు భారతదేశాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, మెచ్చుకోవడానికి కారణాలని ఆయన వివరించారు.

రష్యా అధ్యక్ష కేంద్రం క్రెమ్లిన్‌కు సన్నిహితంగా ఉండే ఈ మేధావుల క్లబ్ వాల్డాయ్ డిస్కషన్ క్లబ్ సమావేశాల్లో మాట్లాడుతూ మోదీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుండటం ప్రశంసనీయమని చెప్పారు.

‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎంతో కృషి జరుగుతోంది. ఆయన తన దేశానికి భక్తుడు. ఆయన అనుసరిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ సిద్ధాంతం అటు ఆర్థికపరంగా, ఇటు నైతిక విలువల పరంగా చాలా ముఖ్యమైనది. భవిష్యత్తు భారత దేశానిదే. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత దేశం అనే వాస్తవం గర్వకారణం’’ అని ఆయన ప్రశంసించారు.

భారత్, రష్యా మధ్య సంబంధాలు చాలా ప్రత్యేకమైనవని చెబుతూ అనేక దశాబ్దాల నుంచి సన్నిహిత మైత్రీ సంబంధాల బలమైన పునాదులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంక్లిష్ట సమస్యలేవీ ఎన్నడూ ఎదురు కాలేదని, ఒకరికొకరం మద్దతిచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని పేర్కొంటూ భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి