
బెంగళూరు: హిజాబ్ ధారణకు అనుకూలంగా కర్ణాటకలో జరిగిన నిరసనల వెనక ఇస్లాం సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) హస్తం ఉందని సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. నిరసనలు దానికవే చెలరేగలేదని భారీ కుట్రలో భాగంగానే జరిగాయని ఆరోపించింది. ప్రజల మతపరమైన భావాలను ఆధారంగా చేసుకొని ఆ సంస్థ సోషల్ మీడియాలో ప్రచారాలు నిర్వహించిందని కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
‘పీఎఫ్ఐ సంస్థ సామాజిక మాధ్యమాల్లో క్యాంపెయిన్ ప్రారంభించింది. విద్యార్థులందరినీ హిజాబ్ ధరించాలని కోరింది. ఇదేదీ(నిరసనలు) అప్పటికప్పుడు కొంతమంది విద్యార్థులు ప్రారంభించింది కాదు. ఇవి భారీ కుట్రలో భాగమే. విద్యార్థులు వారికి వచ్చిన సూచనల ఆధారంగానే నడుచుకున్నారు. గతేడాది వరకు కర్ణాటకలోని స్కూళ్ళలో ఏ బాలిక కూడా హిజాబ్ ధరించలేదు. హిజాబ్ ధరించకూడదని చెప్పి ఒక మతానికి వ్యతిరేకిస్తున్నారని అనుకోవడం సరికాదు’ అని తుషార్ మెహతా వివరించారు.
సమానత్వం, సమగ్రతకు భంగం కలిగే దుస్తులు ధరించకూడదని కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎలాంటి సమస్య లేదని మెహతా అన్నారు. అది మతపరంగా తటస్థ నిర్ణయమని పేర్కొన్నారు. హిజాబ్ వివాదం చెలరేగిన సమయంలోనే మరో వర్గానికి చెందిన కొందరు కాషాయ కండువా కప్పుకొని వచ్చారని, అది కూడా నిబంధనలకు విరుద్ధమేనని స్పష్టం చేశారు. కాగా, ఈ అంశంపై ఈ రోజు వాదనలు కొనసాగనున్నాయి.
Source: EtvBharat