* మాజీ ముఖ్యమంత్రి సహా భాజపాలో చేరనున్న 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
గోవాలో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. వారంతా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, అసెంబ్లీ స్పీకర్ ను కలిశారు. ఈ మేరకు పార్టీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలకు గానూ భాజపా 20 సీట్లు దక్కించుకొంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది భాజపాలో చేరారు. అంటే మూడింట రెండొంతుల మంది పార్టీని వీడితే.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును కూడా తప్పించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక భాజపాలో చేరిన నాయకుల జాబితాలో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మైకెల్ లోబో సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు.
ఇక 2019లో కూడా 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన తరుణంలో తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బే.